Rains To Continue Across Telangana : రాష్ట్రవ్యాప్తంగా రాగల మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ విస్తారంగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. మంచిర్యాల జిల్లా మందమర్రిలో 363 జాతీయ రహదారి సంబంధించిన సర్వీస్ రోడ్డులో కొంత భాగం కుంగిపోయింది. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని కప్పలవాగు చెక్‌డ్యాం పూర్తిగా నిండింది. నిజామాబాద్ నగరంలో పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. భీంగల్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లే దారి కోతకు గురైంది. బోధన్ పట్టణ దాహార్తిని తీర్చే బెళ్లాల్ చెరువు అలుగు పారుతోంది.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్, ఫకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య వాగుపై ఉన్న రహదారి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. వేములవాడ హన్మాజి పేట దారిలో నక్క వాగులో నీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిర్విరామంగా కురిసిన వర్షానికి పెద్దపల్లి జిల్లా మంథనిలో ఒక ఇంటి పైకప్పుతో పాటు గోడలు కూలిపోయాయి. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాప్రాయం తప్పింది.
బురద నీటిలో కూర్చోని కార్పోరేటర్ నిరసన : రామగుండం కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యంతో రోడ్లన్నీ దెబ్బతిని నడవలేని పరిస్థితి నెలకొందంటూ ఓ కార్పోరేటర్ రోడ్డపై బురద నీటి గుంతలో కాలనీ వాసులతో కూర్చోని నిరసన తెలిపారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో పలువురి ఇండ్లలో వరద నీరుచేరి ఇబ్బందులు పడ్డారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ శివారులోని చిలుకవాగుకు వరద ఉద్ధృతి పెరిగి రోడ్డుపై నుంచి ప్రవహిస్తోంది. వాగు పక్కనే స్మశాన వాటిక ఉండడంతో చనిపోయిన వారిని ఖననం చేయడానికి ఏటా ఇబ్బంది ఏర్పడుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని వాగులూ వంకలూ పొంగి ప్రవహిస్తున్నాయి. వంతెనలపైకి నీరు వచ్చి చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా చెరువులు, కుంటల్లోకి భారీగా నీరు చేరుతోంది. ములుగు జిల్లాలోనూ తెరిపి లేని వర్షాలకు లోతట్టు ప్రాంతాల జలమయమయ్యాయి. వాజేడు మండలం టేకులగూడెం సమీపంలో గోదావరి వరద ఉరకలెత్తుతుండటంతో ఛత్తీస్‌గఢ్-తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
బొగ్గు ఉత్పత్తికి అంతరాయం : కాళేశ్వర త్రివేణిసంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో వర్షం తగ్గుముఖం పట్టినా మున్నేరు, ఆకేరు, పాకాల వాగులు పొంగి పొర్లుతున్నాయి. భూపాలపల్లి జిల్లాలోని మోరంచ వాగు, చలివాగు, మానేరు వాగులు పొంగిపొర్లుతుండటంతో పలు గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని ఉపరితల బొగ్గు గనులలో వరద నీరు వచ్చి చేరడంతో ఓపెన్ కాస్ట్ 2,3 గనుల్లో రోడ్లన్నీ బురదమయమయమై బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది. 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
అలుగు పారుతున్న చెరువులు - ఆనందంలో అన్నదాతలు - వీడియో చూశారా? - RAINS IN NIZAMABAD TODAY NEWS
మా రోడ్డెక్కడో పోయింది? - వర్షాలతో కొట్టుకుపోయిన రహదారులు - RAIN DAMAGE ROADS IN BHUPALPALLY