Heavy Rains in Telangana : రాష్ట్రంలో 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదారాబాద్ వాతావరణం కేంద్రం ప్రకటించింది. ఇవాళ కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి సహా మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుండగా, దక్షిణ, ఆగ్నేయ దిశలలో గాలులు వీస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అకాల వర్షాలకు నేలరాలిన మామిడి - 1500 ఎకరాల్లో పంట నష్టం - MANGO FARMERS LOSS IN NALGONDA
ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. నగరానికి భారీ వర్ష హెచ్చరిక నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సమస్యలపై సంప్రదించేందుకు 040 21111111, 9000113667 నెంబర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పెద్ద శంకరంపేట మండలంలో పిడుగు పాటుకు తాత, మనవడు మృతి చెందారు. ఐకేపీ కేంద్రంలో ధాన్యం కుప్పలపై టార్పాలిన్ కప్పడానికి వెళ్లగా, పిడుగు పాటుతో తాత శ్రీరాములు (50), విశాల్ (11) అక్కడికక్కడే మృతి చెందారు.
జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పలు ప్రాంతాల్లో ధాన్యం తడిచింది. ఈదురు గాలులకు ధాన్యం కుప్పలపై టార్పాలిన్ కవర్లు ఎగిరిపోయాయి. సంగారెడ్డి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. నాగలిగిద్ద మండలం ముక్తాపూర్‌లో 5.1 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది. మొగుడంపల్లిలో 2.6 సెం.మీ, పాపన్నపేట మండలం లింగాయిపల్లిలో 1.9 సెం.మీ వర్షపాతం నమోదైంది.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గిమ్మ గ్రామంలో పిడుగు పాటు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి. వారందరినీ సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసిఫాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఎన్నికల సామగ్రి నిల్వ ఉంటే కేంద్రంలో ఈదురు గాలులకు టెంట్లు కూలాయి. ఎన్నికల సామగ్రి కేంద్రం వరండాలో ఎన్నికల సిబ్బంది తలదాచుకున్నారు. భారీ వర్షంతో పలు కేంద్రాలకు వెళ్లేందుకు పోలింగ్ సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వర్షం నింపిన విషాదం - బాచుపల్లిలో గోడ కూలి ఏడుగురు దుర్మరణం - Wall Collapse in Hyderabad
నడివేసవిలో వర్షబీభత్సం - నేలరాలిన పంటలు - కొట్టుకుపోయిన ధాన్యరాశులు - SUDDEN RAINS IN TELANGANA