Rahul Gandhi Comments : కులవివక్ష, కులవ్యవస్థ ఉన్నప్పుడు అసమానతలు ఎక్కువగా ఉంటాయని, అంటరానితనం భారత్‌లో తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడా లేదని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దేశం ఆర్థికంగా ఎదగాలంటే కులవివక్ష ఉండకూడదని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి గాంధీ తత్వ చింతన కేంద్రంలో కులగణనపై సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడారు. కులగణనలో కొన్ని పొరపాట్లు జరగవచ్చని, వాటిని సరిదిద్దుతామని స్పష్టం చేశారు.
కులవివక్ష ఉందని ఒప్పుకుందాం: దేశంలో కులవ్యవస్థ, కులవివక్ష ఉందని ఒప్పుకుందామని రాహుల్ గాంధీ అన్నారు. తాను దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నానని ఆరోపణలు చేస్తున్నారని, దేశం గురించి నిజం చెబితే దేశాన్ని విభజించడమా అని ప్రశ్నించారు. కులగణన ద్వారా దళితులు, ఓబీసీలు, మహిళల సంఖ్యపై స్పష్టత వస్తుందన్నారు. కులగణన తర్వాత ఎవరి దగ్గర ఎంత ఆర్థిక వనరులున్నాయో తెలుసుకుందామన్న రాహుల్.. కులగణన చేస్తామని పార్లమెంట్‌లో స్పష్టంగా తాను చెప్పానని గుర్తు చేశారు.
రిజర్వేషన్ల పరిమితిని తీసేస్తామన్న రాహుల్, తెలంగాణలో జరిగే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కులగణనలో ఏ ప్రశ్నలు అడగాలనేది అధికారులు నిర్ణయించకూడదు, సామాన్యులు నిర్ణయించాలన్నారు. కులగణన చేసి, జనాభా తగ్గట్లు రిజర్వేషన్లు పెంచుతామని తెలిపారు.
తెలంగాణలో కులగణన నిర్ణయం అభినందనీయమని కొనియాడారు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు ఇవి దోహద పడతాయని ఆయన వెల్లడించారు. దేశంలో కులవివక్ష ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు ఛాలెంజ్ చేయట్లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కుల వివక్ష ఉందని తెలిసిన వాళ్లే అందరికీ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు పాల్గొన్నారు. తత్వ చింతన కేంద్రంలో మేధావులు, బీసీ సంఘాలతో రాహుల్ ముఖాముఖి నిర్వహించారు. ముఖాముఖిలో కుల, విద్యార్థి సంఘాలు, మేధావులు పాల్గొన్నారు. రాహుల్‌గాంధీతో ముఖాముఖికి 400 మంది మేధావులను ఆహ్వానించారు. కులగణన ద్వారా జరిగే లాభాలను రాహుల్ గాంధీ వివరించారు. అనంతరం బోయిన్‌పల్లి నుంచి బేగంపేటకి రాహుల్‌గాంధీ బయలుదేరారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ పయనమయ్యారు.
తెలంగాణలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే - ఆ పత్రాలన్నీ రెడీ చేసుకోండి !