Raghurama Custodial Torture Case Update : రఘురామకృష్ణ రాజుకు కస్టడీలో చిత్రహింసల కేసులో నిందితుడిగా ఉన్న సీఐడీ విశ్రాంత ఎస్పీ విజయ్‌పాల్‌ను ఒంగోలు తరలించారు. పోలీసు కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు జిల్లా ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
దీంతో శుక్రవారం ఉదయం గుంటూరు జైలు నుంచి విజయ్‌పాల్‌ను ఒంగోలు తీసుకెళ్లారు. అంతకుముందు గుంటూరు జీజీహెచ్‌లో ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించారు. విజయ్‌పాల్‌ను శుక్ర, శనివారాల్లో ప్రకాశం జిల్లా ఎస్పీ విచారించనున్నారు.
14వ తేదీ (శనివారం) సాయంత్రం కస్టడీ ముగిసిన తర్వాత తిరిగి గుంటూరు జిల్లా జైలుకు తీసుకురానున్నారు. ఎవరి ఆదేశాలతో రఘు రామకృష్ణంరాజుపై హత్యాప్రయత్నం చేశారు? చిత్రహింసలు పెట్టే సమయంలో ఆ వీడియోను ఎవరికి చూపారు? ఎంత మంది కస్టోడియల్ టార్చర్‌కు పాల్పడ్డారు? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టనున్నట్లు తెలుస్తుంది.
గతంలోనే తనపై కస్టోడియల్ టార్చర్ చేశారని రఘురామకృష్ణంరాజు గుంటూరు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు . కేసు నమోదు చేసిన పోలీసులు ఈకేసులో విజయపాల్‌ను అరెస్ట్ చేశారు . ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.
రఘురామ కేసులో జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతికి చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించగా కోర్టు దాన్ని కొట్టివేసింది. రఘురామ కస్టోడియల్ కేసులో ఏ5గా డాక్టర్ ప్రభావతి ఉన్నారు.
గుండెపోటుతో మరణించేలా కుట్ర - విజయ్‌పాల్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు