Radisson Drug Case Update : రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. ఇందులో ప్రముఖ సినీ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ వ్యవహారం ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది. ముందుగా ఈ కేసులో శుక్రవారం విచారణకు హాజరవుతానని చెప్పిన క్రిష్(Director Krish) ఆ తర్వాత సోమవారం రోజు వస్తానని సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పుడు మాత్రం నేరుగా హైకోర్టును ఆశ్రయించారు.
ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని జాగర్లముడి క్రిష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ జాగర్లముడి క్రిష్ దర్శకత్వం వహించారని ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు(Film Fare Award)ను సైతం దక్కించుకున్నాడని పిటిషనర్ తరఫు న్యాయవాది అచ్యుత్ భరద్వాజ్ కోర్టుకు తెలిపారు. ఈ నెల 25వ తేదీన గచ్చిబౌలి పోలీసులు రాడిసన్ హోటల్‌లో పక్కా సమాచారం మేరకు దాడులు చేసి రెండు గదుల్లో పార్టీ నిర్వహించి కొకైన్(Drugs Case) సేకరించినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని అందులో రాడిసన్ హోటల్ యజమాని కుమారుడు వివేకానందను ప్రధాన నిందితుడిగా చేర్చినట్లు కోర్టుకు తెలిపారు.
వివేకానంద ఇచ్చిన సమాచారం మేరకు కొంత మందిని నిందితులుగా చేర్చారని అందులో 10వ నిందితుడిగా జాగర్లముడి క్రిష్ పేరు చేర్చినట్లు అచ్యుత్ భరద్వాజ్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్‌కు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని కనీసం సంఘటనా స్థలానికి కూడా క్రిష్ వెళ్లలేదని న్యాయవాది తెలిపారు. క్రిష్ నివాసం హైదరాబాద్‌లోనే ఉందని ఆయన ఎక్కడికి వెళ్లడని పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తారని అచ్యుత్ భరద్వాజ్ కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని గచ్చిబౌలి పోలీసులకు సూచిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
గచ్చిబౌలి డ్రగ్స్ కేసులో మంజీర గ్రూప్ డైరెక్టర్ అరెస్ట్ - 8 మందిపై కేసు నమోదు
Radisson Drug Case Director Krish Petition : ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే ఈ నెల 24న హైదరాబాద్‌లోని రాడిసన్ హోటల్(Radisson Blue Hotel)లో మంజీరా గ్రూప్ డైరెక్టర్ గజ్జల వివేకానంద్ స్నేహితులతో కలిసి డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి 3 గ్రాముల కొకైన్ తెప్పించుకొని హోటల్లోని రెండు గదుల్లో పార్టీ చేసుకున్నారు. పార్టీపై సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు అర్ధరాత్రి హోటల్‌కు చేరుకోగా, పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో వారంతా అక్కడి నుంచి జంప్ అయ్యారు. గదులను సోదా చేయగా కొకైన్ ఆనవాళ్లు గుర్తించి వివేకానంద్ ఇంటికెళ్లి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో డ్రగ్స్ సేవించినట్లు వివేకా అంగీకరించాడు. అతడితో పాటు డ్రగ్స్ పార్టీలో కేదార్, నిర్బయ్, క్రిష్, నీల్, లిషి, శ్వేత, సందీప్, రఘుచరణ్ పాల్గొన్నారని తెలిపారు. వీరికి సయ్యద్ అబ్బాస్ అలీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని విచారణలో పేర్కొన్నారు.
సయ్యద్ అబ్బాస్ అలీని అరెస్టు చేసిన పోలీసులు విచారణలో వహీద్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు చెప్పాడు. అనంతరం వహీద్ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. వహీద్‌ను విచారించే క్రమంలో అతను ఇమ్రాన్ సహా మరో వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇలా ఒకరి నుంచి ఒకరికి డ్రగ్స్ చేరి వివేకానంద డ్రైవర్ గద్దల ప్రవీణ్‌కు ఆ తర్వాత వివేకాకు చేరినట్లు పేర్కొన్నారు. డ్రగ్స్ పెడ్లర్ సయ్యద్‌ను విచారించే క్రమంలో డ్రగ్స్ పార్టీలో క్రిష్ పాల్గొన్నట్లు చెప్పాడు. ఇంకా ఈ విషయంపై పూర్తి దర్యాప్తు జరుగుతుంది
డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ - విచారణకు శుక్రవారం కాదు సోమవారం వస్తానన్న దర్శకుడు క్రిష్
రాడిసన్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం - ప్రధాన నిందితుడి నుంచి కీలక విషయాలు