Radisson Drug Case Latest Updates : గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్‌లో (Radisson Hotel) గత నెల 24న జరిగిన పార్టీలో మత్తు పదార్థాలు సేవించి పట్టుబడిన మంజీరా గ్రూప్ డైరెక్టర్ వివేకానంద కేసులో పోలీసులు దర్యాప్తు (Police Investigation) వేగవంతం చేశారు. ఇప్పటికే ఆ కేసులో వివేకానంద, స్నేహితులు నిర్భయ్, కేదార్, మత్తు పదార్థాల సరఫరాదారుడు అబ్బాస్, అతనికి అందించిన మీర్జా వాహిద్‌బేగ్, వివేకానంద డ్రైవర్ ప్రవీణ్‌ను అరెస్ట్ చేశారు. పార్టీ జరిగిన తర్వాత నుంచి దర్శకుడు క్రిష్ అజ్ఞాతంలోకి వెళ్లారు. డ్రగ్స్ పార్టీ గురించి మీడియాలో కథనాలతో స్పందించిన ఆయన, ముంబైలో ఉన్నట్లు ప్రకటించారు. అనూహ్యంగా ఆయన పోలీసుల ముందుకొచ్చిన విషయాన్ని రహస్యంగా ఉంచారు.
అతడి నుంచి పోలీసులు రక్త, మూత్ర నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం పంపించారు. పార్టీ జరిగి ఇప్పటికే వారం గడిచినందున డ్రగ్స్ (Drugs) తీసుకొని ఉంటే నమూనాల్లో ఆనవాళ్లు లభిస్తాయా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ క్రిష్ హైకోర్టును ఆశ్రయించగా, విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఇప్పటికే ముగ్గురు నిందితుల నమూనాల విశ్లేషణలో పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. హోటల్‌పై దాడి చేసిన సమయంలో డ్రగ్స్ దొరక్కపోవడంతో ప్రధాన నిందితుడి జ్యుడీషియల్ రిమాండ్‌కు అనుమతి రాలేదు. కానీ హోటల్లో లభించిన మూడు ఖాళీ ప్లాస్టిక్ పేపర్లతో పాటు ఓ వైట్ పేపర్‌లో తెల్లటి పొడి ఆనవాళ్లు విశ్లేషించి కొకైన్‌గా గుర్తించారు.
రాడిసన్ డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్టులు - రేపు విచారణకు దర్శకుడు క్రిష్
Director Krish Attended Police Investigation : కేసులో 14 మందికి ప్రమేయముందని ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో తేలింది. లిషి, సందీప్, శ్వేత, నీల్ పోలీసుల ముందుకు రాలేదు. గోవాలో శ్వేత, కర్ణాటకలో సందీప్ ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు, వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటికీ లిషి జాడ మాత్రం చిక్కలేదు. డ్రగ్స్ తీసుకోనప్పుడు పరీక్షల విశ్లేషణలకు ముందుకొచ్చేందుకు నిందితులు ఎందుకు వెనకాడుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. సమయం గడిచే కొద్దీ మూత్ర విశ్లేషణలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉండవనే కారణంతోనే నిందితులు కాలయాపన చేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీలైనంత త్వరగా నిందితులను గుర్తించి వైద్య పరీక్షలకు పంపే యోచనతో పోలీసులు గాలింపు విస్తృతం చేశారు.
ఇప్పటికే నీల్ విదేశాలకు వెళ్లినట్లుగా అనుమానిస్తుండటంతో అతడిపై లుక్ అవుట్ నోటీసుల జారీకి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. మీర్జా విచారణలో చెప్పిన ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. యాకుత్‌పురాకు చెందిన బేగ్‌కు అదే ప్రాంతానికి చెందిన ఇమ్రాన్, అబ్దుల్ రెహమాన్ అనే పెడ్లర్ల ద్వారా కొకైన్ సరఫరా జరిగినట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్, రెహమాన్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారిని పట్టుకుంటే కొకైన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే సమాచారం వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.
'రాడిసన్ డ్రగ్స్ కేసులో నన్ను ఇరికించాలని చూస్తున్నారు' - హైకోర్టులో దర్శకుడు క్రిష్ పిటిషన్
డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ - విచారణకు శుక్రవారం కాదు సోమవారం వస్తానన్న దర్శకుడు క్రిష్