Questions Arising on CM YS Jagan Security: సీఎం హోదాలో ఐదేళ్లుగా జగన్‌కు పటిష్ఠమైన భద్రత, బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయనతో పాటు విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులకూ భద్రత కల్పించేలా ఏకంగా ఓ చట్టాన్నే చేశారు. సీఎంకు ఎప్పుడూ జెడ్ కేటగిరీ హోదాలో ప్రత్యేకంగా సీఎం సెక్యూరిటీ వింగ్ భద్రత కల్పిస్తుంది. మూడు షిఫ్టుల్లో పదుల సంఖ్యలో బాడీగార్డులు, సాయుధ గార్డులు అంటిపెట్టుకునే ఉంటారు.
దీనికితోడు ఆయన ఇంటికి రక్షణగా సాయుధులైన పోలీసు బలగాల కాపలా. ఇంత భద్రత ఉన్నా ప్రతిపక్షనేత చంద్రబాబుకు బ్లాక్ క్యాట్ కమాండోల రక్షణ ఉండడంతో, తనకెందుకు ఆ తరహా రక్షణ లేదనుకున్న జగన్ అందుకు తగ్గట్టే ఆక్టోపస్ కమాండోలను భద్రత కోసం పెట్టుకున్నారు. ఉగ్రవాద దాడులను సైతం దీటుగా తిప్పికొట్టగలిగే సామర్ధ్యం ఉన్న ఆక్టోపస్ కమాండో యూనిట్‌ను రక్షణ కవచంగా మార్చేసుకున్నారు. జగన్ ఎక్కడికెళ్లినా ఈ కమాండోల బృందం సీఎం సెక్యూరిటీ వింగ్‌తో కలిసి రక్షణ కల్పిస్తుంది.
సీఎం జగన్‌పై దాడి ఘటనపై కేసు నమోదు - టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో విచారణ - attack on ap cm ys jagan
ప్రాణాలకు ముప్పు ఉందని నివేదిక: సీఎం జగన్ ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉన్నట్టు డీజీపీ నేతృత్వంలోని భద్రతా కమిటీ 2019 అక్టోబర్‌లో నివేదిక ఇచ్చింది. ఐఎస్ఐ ఉగ్రవాదులు, ఆల్ ఖైదా తీవ్రవాదుల నుంచి ప్రాణాలకు ముప్పు ఉందని ఆ నివేదికలో పేర్కొంది. అందుకు అనుగుణంగా అత్యవసర రక్షణ కవచంగా సీఎస్‌డబ్ల్యూ బాడీగార్డులతో పాటు బ్లాక్ క్యాట్ కమాండోలుగా కనిపించే ఆక్టోపస్ బలగాలతో రక్షణ కల్పించారు. ఐదేళ్లుగా సీఎం ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక భద్రత కల్పించాల్సిందిగా స్థానిక ఎస్పీలకు, పోలీసు కమిషనర్లకు అత్యవసర సందేశం వెళ్లేది. దిల్లీ వెళ్లినా అక్కడ పోలీసు విభాగానికి, హోంశాఖకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సందేశాన్ని పంపేది.
ఇంతలోనే ఏం మారిపోయింది: తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందన్న కారణంతో జగన్ ఎక్కడకెళ్లినా చెట్లను కొట్టేసి, రద్దీగా ఉండే రోడ్లకు అడ్డంగా బారికేడ్లు పెట్టేసి, ప్రజలు రాకుండా పరదాలు కట్టేసి, అప్రకటిత కర్ఫ్యూలా దుకాణాలను మూసేయించేవారు. ప్రధాని వచ్చినా పచ్చని చెట్లను కొట్టేయమని ఎస్పీజీ ఎప్పుడూ సూచించలేదు. అయితే రాష్ట్ర పోలీసు అధికారులు మాత్రం జగన్ వస్తే చాలు పర్యావరణానికి తూట్లు పొడిచేవారు. ఎన్నికలు రాగానే పరిస్థితి అందుకు భిన్నంగా మారిపోయింది. జగన్ పర్యటిస్తున్న ప్రాంతాల్లో పరదాలు, బారికేడ్లు కనిపించడం లేదు. ఇంతలోనే ఏం మారిపోయిందన్నది ప్రశ్నార్ధకం.
సీఎం జగన్‌పై దాడి ఘటన - వివరాలు కోరిన కేంద్ర ఎన్నికల సంఘం - EC ON JAGAN INCIDENT
ఓట్ల కోసమే భద్రత పక్కకు పోయిందా: అధికారంలోకి వచ్చిన వెంటనే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోని ఇంటికి రక్షణగా ఇనుప కంచెలను జగన్ ఏర్పాటు చేయించారు. ఇంటి గోడలపై ప్రొటెక్షన్ డోమ్‌లను అప్పటికప్పుడు కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి కట్టేశారు. సీఎంకు భద్రత పేరుతో క్యాంపు కార్యాలయం ఎదురుగా ఉన్న పేదలను రాత్రికిరాత్రి ఇళ్లు ఖాళీ చేయించి పంపేశారు. వారి ఇళ్లను కూల్చేసి ముఖ్యమంత్రికి ఆహ్లాదం కోసం పార్కుగా మార్చేశారు. కరకట్టకు ఆనుకుని కిలోమీటరు మేర ఇనుప కంచెలు బిగించారు.
ఇంతగా భద్రతా ఏర్పాట్లు చేయించుకున్న జగన్‌కు ప్రస్తుతం ఎన్నికలు దగ్గరకు రాగానే ఐఎస్ఐ, అల్ ఖైదా ఉగ్రవాదులు, మావోయిస్టుల నుంచి ప్రాణహాని పోయిందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఓట్ల కోసం జనం చేతులు పట్టుకుని ముద్దాడుతున్న జగన్‌కు ఇప్పుడు ప్రాణహాని లేదా అన్న ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. ఏ ఉగ్రవాద సంస్థ నుంచి ఎలాంటి హానీ లేదని డీజీపీ నేతృత్వంలోని భద్రతా కమిటీ సూచనలు చేసిందా అన్న సందేహం కలుగుతోంది. ఓట్ల కోసమే పరదాలు, భద్రత పక్కకు పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.