The wedding magazine that found the culprit: ఆరు నెలల వయసున్న కుమారుడిని అతి కిరాతకంగా గొంతు నులిమి హత్య చేసిన కన్నతండ్రిని కర్మసిద్ధాంతం వదల్లేదు. ఎవరికీ కనిపించకుండా సుదూర ప్రాంతంలో మారుపేరుతో కొత్త జీవితాన్ని ఆరంభించి హాయిగా కాలం గడిపేస్తున్నాడు. అయితే పాతికేళ్ల తరువాత కుమార్తె పెళ్లిపత్రిక మాత్రం నిందితుడిని పట్టించి కటకటాల్లోకి నెట్టింది. సోమవారం పుట్టపర్తి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రత్న కేసు ఛేదించిన తీరును వివరించారు.
ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి.. ఆమెకు రెండో పెళ్లి జరిగిన కొద్దిరోజులకే.. పిల్లల్ని చంపేసి..
చిన్న కథ కాదు: శ్రీసత్యసాయి జిల్లా గుడిబండ మండలం దిన్నెహట్టి గ్రామానికి చెందిన తిప్పేస్వామి తన భార్య కరియమ్మపై అనుమానం పెంచుకున్నాడు. 1998 సంవత్సరంలో దసరా రోజున గుడిలో పూజ చేయాలని 6 నెలల తన రెండో కుమారుడు శివలింగమయ్యను, భార్యను తిప్పేస్వామి ఆలయానికి వెంటబెట్టుకుని తీసుకెళ్లాడు. భార్య ప్రదక్షిణ చేస్తుండగా కొడుకును లాక్కొని సమీప మామిడి తోటలోకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో కుమారుడిని గొంతు నులిమి హతమార్చి ఆ తరువాత గొయ్యి తీసి అందులో ఆ పసివాడ్ని పూడ్చి అక్కడి నుంచి పారిపోయాడు. తన భర్త చేసిన ఈ ఘాతుకానికి అదే ఏడాది సరిగ్గా అక్టోబరు 18న గుడిబండ పోలీస్ స్టేషన్‌లో భార్య కరియమ్మ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలించినా ఫలితం లేకపోయింది.
గంటల వ్యవధిలోనే పట్టుబడ్డ నిందితుడు - బెడిసికొట్టిన వ్యూహాలు
పెండింగ్ కేసులపై దృష్టి: శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో పెండింగ్ కేసులపై ఎస్పీ దృష్టి సారించారు. చిన్నారి హత్య కేసుకు సంబందించిన విచారణ బాధ్యతలను డీఎస్పీ వెంకటేశ్వర్లు తీసుకున్నారు. ఇదే సమయంలో దిన్నేహట్టి గ్రామానికి చెందిన బాంబే నాగరాజు, నిందితుడు తిప్పేస్వామిని కలిసినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అతని ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.
పెళ్లి పత్రిక పట్టేసింది: నిందితుడు తిప్పేస్వామి కర్ణాటకలోని హాసన్ జిల్లా న్యామనహళ్లిలో కృష్టగౌడుగా పేరు మార్చుకుని అక్కడే ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమార్తెలు. ఒక కుమార్తెకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. స్వగ్రామంలో మిత్రుడైన బాంబే నాగరాజును తిప్పేస్వామి (నిందితుడు) ఆహ్వానిస్తూ పెళ్లి పత్రిక పంపాడు. అతను పెళ్లికి వెళ్లొచ్చాడు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందింది. దీంతో పెళ్లిపత్రిక ఆధారంగా అక్కడికి వెళ్లి తిప్పేస్వామిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన పెనుకొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు, మడకశిర సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్, గుడిబండ ఎస్‌ఐ మునిప్రతాప్, కానిస్టేబుల్ మల్లికార్జున, పాతన్న, వెంకటేశ్, నరేశ్, మహమ్మద్‌రఫీ, హోంగార్డు హరికుమార్‌లను ఎస్పీ రత్న, అదనపు ఎస్పీ ఆళ్ల శ్రీనివాసులు అభినందించి వారికి రివార్డు అందజేశారు.
వైఎస్సార్ జిల్లాలో దారుణం - ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కీచకుడు