PC GHOSH COMMISSION INQUIRY ON KALESHWARAM PROJECT : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణంలో 50 మందికి పైగా సబ్ కాంట్రాక్టర్లు పనులు చేసినట్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గుర్తించినట్లు తెలిసింది. 3 ఆనకట్టలకు సంబంధించి కమిషన్ విచారణ కొనసాగుతోంది. పంప్ హౌస్‌ల నిర్మాణ సంస్థకు చెందిన ముగ్గురు ప్రతినిధులు ఇవాళ కమిషన్ ముందు హాజరయ్యారు. పంప్‌హౌస్‌ల నుంచి నీటి విడుదల ఆదేశాలు, నీటి మట్టం సహా అవసరమైన వివరాలను తీసుకొన్న జస్టిస్ ఘోష్, వాటి ఆధారంగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించారు.
డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ ఫణి భూషణ్ శర్మ కూడా కమిషన్ ముందు హాజరయ్యారు. బిల్లుల చెల్లింపులకు సంబంధించి ఆరా తీశారు. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో సాంకేతిక అంశాలపై దృష్టి సారించిన జస్టిస్ పీసీ ఘోష్, ఆర్థిక అంశాలపై కూడా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాల గురించి కూడా తెలుసుకుంటున్నారు. శుక్రవారం కమిషన్ ముందుకు కొందరు ప్రైవేట్ వ్యక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. విద్యుత్ శాఖ ఇంజినీర్ కె.రఘు సోమవారం, కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం మంగళవారం కమిషన్ ముందుకు రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అంశాలపై ఇరువురు జస్టిస్ పీసీ ఘోష్‌కు పవర్ పాయింట్ ఇవ్వనున్నట్లు సమాచారం.
3 ఆనకట్టల్లో 50 మందికి పైగా సబ్ కాంట్రాక్టర్లు : అధికారికంగా ఎలాంటి వివరాలు లేనప్పటికీ మూడు ఆనకట్టల్లో 50 మందికి పైగా సబ్ కాంట్రాక్టర్లను కమిషన్ గుర్తించినట్లు తెలిసింది. అందులో గత ప్రభుత్వ పెద్దలకు దగ్గరి వారు కూడా ఉన్నట్లు చెప్తున్నారు. అటు విచారణ ప్రక్రియలో భాగంగా ఒక న్యాయవాది, ఒక చార్టెర్డ్ అకౌంటెంట్‌ను నియమించుకోనున్నారు. బహిరంగ విచారణ సమయంలో కమిషన్ తరఫున క్రాస్ ఎగ్జామినేషన్ కోసం స్థానిక న్యాయవాది కాకుండా దిల్లీ లేదా ముంబయి న్యాయవాది సేవలు వినియోగించాలని భావిస్తున్న కమిషన్, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనుంది.