Amaravati Drone Show : విజయవాడలో నిర్వహించిన డ్రోన్ షో ప్రజలతో అదుర్స్ అనిపించింది. విశాలమైన కృష్ణమ్మ తీరంలో వినీలాకాశంలో ఎగిరిన వేలాది డ్రోన్లు ప్రజలను మంత్రముగ్ధుల్ని చేశాయి. అద్భుతమైన దృశ్యాలను చూసి వావ్, సూపర్, షో అంటూ జనం సంభ్రమాశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. మధురానుభూతులను సొంతం చేసుకున్నారు. ఈ అత్యద్భుత షోని నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
డ్రోన్ షో సూపర్ హిట్ : విజయవాడ ప్రకాశం బ్యారేజీ ఎగువన పున్నమి ఘాట్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డ్రోన్ షో సూపర్ హిట్ అని ప్రజల నోట వినిపించింది. 5,500 డ్రోన్లు ఆకాశంలో సమాంతరంగా ఎగిరి 15 నిమిషాల పాటు అటూ ఇటూ తిరుగుతూ ప్రేక్షకులను అబ్బుర పరిచాయి. వినీలాకాశంలో ప్రత్యక్షమైన విభిన్న రకాల ఆకృతులను వేలాది మంది సందర్శకులు కళ్లార్పకుండా చూశారు. సెల్‌ఫోన్లు, కెమెరాల్లో అందమైన, ఆకర్షణీయమైన దృశ్యాలను చిత్రీకరించుకుని మురిసిపోయారు.
అమరావతి డ్రోన్ షో అదుర్స్ - ఐదు గిన్నిస్ రికార్డులు
అబ్బురపరిచే విన్యాసాలు : డ్రోన్ ప్రదర్శనకు ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కృష్ణం వందే జగద్గురం అంటూ సాగిన కళా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు దశావతారాలను కళ్లకు కట్టినట్లు నృత్య ప్రదర్శన చేశారు. నాటు నాటు అంటూ వికాస్ అన్ బీటబుల్ టీమ్ చేసిన ఆక్రోబాట్స్ ప్రేక్షకులను చూపు తిప్పుకోనివ్వలేదు. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలను ముఖ్యమంత్రి చంద్రబాబు మైమరచిపోయి వీక్షించారు.
షోకి భారీగా తరలివచ్చిన చిన్నారులు : డ్రోన్ షోని వీక్షించేందుకు చిన్నారులు, వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. ఆకాశంలో లైట్ల వెలుగుల్లో ఏర్పడిన ఆకృతులను చూసి వాళ్లంతా కేరింతలు కొట్టారు. డ్రోన్ షో నభూతో నభవిష్యతిలా ఉందంటూ పలువురు పర్యాటకులు, సందర్శకులూ మెచ్చుకున్నారు. షో ఇంత అద్భుతంగా ఉంటుందని కలలో కూడా ఊహించలేదన్నారు.
అమరావతి డ్రోన్ సమ్మిట్‌కి ముమ్మరంగా ఏర్పాట్లు
మంత్రముగ్ధులైన ప్రజలు : ఇలాంటి కార్యక్రమాల వల్ల ఆహ్లాదం, వినోదం, విజ్ఞానం లభిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. షో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో నమోదు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. డ్రోన్ షో దృశ్యాలను చిత్రీకరించి ప్రజలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. డ్రోన్ షో అదుర్స్ అంటూ ప్రశంసించారు. కేవలం 15 నిమిషాల్లోనే అత్యాధునిక టెక్నాలజీతో రాష్ట్ర ప్రభుత్వం, నిర్వాహకులు అద్భుతాన్ని సృష్టించారంటూ కొనియాడారు.
మంగళగిరిలో అమరావతి డ్రోన్ సమ్మిట్ - ఏపీని డ్రోన్స్ క్యాపిటల్‌గా మార్చాలని నిర్ణయం!