TGPSC JL Posts List : తెలంగాణలో జూనియర్ లెక్చరర్ పోస్టుల ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, పలు జేఎల్ పోస్టులకు సంబంధించి మంగళవారం ప్రొవిజినల్ లిస్టు విడుదలైంది. ఎంపికైన వారి వివరాలను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్షలు గత ఏడాది సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు నిర్వహించారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో జేఎల్ పరీక్ష నిర్వహించారు. కమిషన్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో జూనియర్ లెక్చరర్ పోస్టులకు ప్రకటన వెలువడటం ఇదే తొలిసారి.
టీజీపీఎస్సీ ఇటీవలే డీఎస్సీ ఫలితాలు విడుదల చేసి ఎంపికైన వారికి పోస్టింగులు కూడా ఇచ్చింది. ఇప్పటికే వారు విధుల్లో కూడా జాయిన్ అయ్యారు. ఇప్పుడు జూనియర్ లెక్చరర్ పోస్టుల రిజల్ట్ కూడా రావడంతో త్వరలోనే వీరికి పోస్టింగులు కేటాయించే అవకాశముంది. ఇప్పటికే పలు ప్రభుత్వ కాలేజీల్లో లెక్చరర్ల కొరత కనిపిస్తోంది. కొత్తగా వీరు విధుల్లో చేరితే ఈ సమస్య చాలా వరకు తీరుతుందని అంచనా.