Process Begins Of issuing Tirumala Srivari Darshan Tokens To Locals : స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శన టోకెన్లను జారీ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. తిరుపతిలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలో ఉన్న మహతి ఆడిటోరియంలో ఈవో శ్యామలరావు, తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలతో కలిసి ఆయన స్థానికులకు టోకెన్లను అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనలతోనే స్థానికులకు శ్రీవారి దర్శనం ప్రారభించామని వెల్లడించారు.
నవంబర్ 18న జరిగిన టీటీడీ బోర్డు తొలి సమావేశంలోనే ప్రతి నెల మొదటి మంగళవారం రోజు స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని కమ్యూనిటీ హాల్ లో ఈ టోకెన్లు జారీ చేస్తామన్నారు. డిమాండ్ ను బట్టి టోకెన్లను పెంచే విషయం పరిశీలిస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, టీటీడీకి నగరవాసులు ధన్యవాదాలు తెలిపారు.
కొండపై రాజకీయాలకు చెక్ - టీటీడీ కీలక నిర్ణయం
ప్రతి నెల 3వేల టోకెన్లు : అనంతరం టీటీడీ ఈవో శ్యామలరావు మాట్లాడుతూ, తిరుపతి స్థానికుల కోసం నగరంలోని మహతి ఆడిటోరియంలో 7 కౌంటర్లు, అదేవిధంగా తిరుమల బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో మరో 3 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం డిసెంబరు నెలకు సంబంధించిన టోకెన్లను తిరుమలలో 500, తిరుపతిలో 2,500 జారీ చేస్తామన్నారు. శ్రీవారి దర్శనం కోసం వేచివున్న స్థానికులైనా తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి, తిరుమల నివాసితులకు ఒరిజినల్ ఆధార్ కార్డు ధృవీకరణతో టోకెన్లు జారీ చేయనున్నట్లు చెప్పారు.
ఈ విధంగా ప్రతి నెల మొదటి ఆదివారం ఆ రెండు కేంద్రాల్లోనూ దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు వివరించారు. స్థానిక భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్న 90 రోజుల తరువాత మాత్రమే తదుపరి దర్శనానికి అర్హులని తెలిపారు. స్థానిక భక్తులు సులువుగా టోకెన్లు పొందటం కోసం క్యూలైన్లు, టోకెన్ల జారీకి అన్ని ఏర్పాట్లను టీటీడీనే పూర్తి చేసిందని ఈవో శ్యామలరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శన టోకెన్ల కోసం వచ్చే స్థానికులకు సూచనలు :
- డిసెంబరు మొదటి మంగళవారానికి సంబంధించిన టోకెన్లను నగరంలోని మహతి ఆడిటోరియంలో 7 కౌంటర్లు, తిరుమల బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో 3 కౌంటర్లలో ఇస్తారు.
- భక్తులు తమ ఫోటో, చిరునామా మరియు ఇతర వివరములు కలిగి ఒరిజినల్ ఆధార్ కార్డు చూపవలెను.
- ప్రతి నెల 3వేల టోకెన్లను మాత్రమే విడుదల చేస్తారు.
- ఒకసారి దర్శన టోకెన్లు పొందిన భక్తులకు తదుపరి 90 రోజుల వరకు టోకెన్లు జారీ చేయబడదు.
- 11 సంవత్సరాలోపు వయసు కలిగిన పిల్లలకు టోకెన్లు జారీ చేయబడవు.
- స్థానికులు వీరే : తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి, తిరుమల నివాసితులు
శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్- ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల
రెండు గంటల్లో తిరుమల దర్శనం ఎలా? - మళ్లీ ఆ విధానం తీసుకురానున్నారా!