Private Finance Company Fraud in Rangareddy : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు భూ నిర్వాసితుల నుంచి అధిక వడ్డీ ఆశ చూపి ఓ ఫైనాన్స్ కంపెనీ కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. దాదాపు 20 గ్రామాల ప్రజలు మోసపోయారు. రెండు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగిన న్యాయం జరగలేదంటూ బాధితులు వాపోతున్నారు. అటు భూములను కోల్పోయి ఇటు డబ్బులను పోగొట్టుకుని తమ పిల్లల భవిష్యత్తు రోడ్డుపాలయిందని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
150 Crore Fraud in Nagar Kurnool : నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో దాదాపు 20 గ్రామాల ప్రజలకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఇళ్లు కోల్పోవడంతో ప్రభుత్వం పరిహారంగా కొంత నగదును ఇచ్చింది. ఓ ఫైనాన్స్ కంపెనీ అధిక వడ్డీ ఆశ చూపి 2500 కుటుంబాల నుంచి మొత్తం రూ.150 కోట్లను వసూలు చేసింది. అనంతరం 2021లో ఆ సంస్థను మూసివేశారు. దీంతో ఆ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు 2021లో నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికి ఆ కేసు సమస్య పరిష్కారం కాలేదు.
BC Leader Krishnaiah React on Fraud Case : తమకు జరిగిన అన్యాయాన్ని ఇవాళ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకి తెలిపారు. ఫైనాన్స్ కంపెనీపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోగా ఫిర్యాదు చేసిన వారిని బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆవేదనను అర్థం చేసుకొని తమకు న్యాయం చేయాలంటూ కృష్ణయ్య హైదరాబాద్లోని బీసీ భవన్ నుంచి విద్యానగర్ కూడలి వరకు నిరసన ర్యాలీ చేపట్టారు.
బాధితుల్లో చాలా వరకు మొత్తం భూములు, ఆస్తులు కోల్పోయి వచ్చిన పరిహారాన్ని కూడా కొంత మంది దళారులు మోసం చేస్తుంటే వారికి పోలీసులు, రాజకీయ నాయకులు అండగా నిలబడి మొత్తం దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. పేద ప్రజల పొట్ట కొట్టే ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.
"నా కుమారుడు ఆర్మీలో పని చేస్తూ సెలవుల్లో ఇంటికి వస్తే ప్రమాదంలో చనిపోయాడు. దీనికి ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.30 లక్షల పరిహారాన్ని ఫైనాన్స్ సంస్థ వాళ్లు తమకు తెలిసిన ఒక బ్రోకర్ ద్వారా తీసుకొన్నారు. మొదటి రెండు నెలలు వడ్డీ ఇచ్చి ఆ తరవాత ఎగ్గొట్టారు. ఇప్పుడు నాకు తినడానికి తిండి, పెట్టే వాళ్లు లేరు." - బాధితుడు