PM Narendra Modi Shares Eenadu Essay : రామోజీ గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాసిన కథనం, ఈనాడు దినపత్రికలో ఇవాళ ప్రచురితమైంది. అక్షరయోధుడు రామోజీకి నివాళులు అర్పిస్తూ తాను రాసిన వ్యాసం, ఈనాడులో ప్రచురితమైనట్లు వెల్లడిస్తూ తన సోషల్మీడియా ఎక్స్ ఖాతాలో మోదీ పంచుకున్నారు.
గడిచిన కొద్ది వారాలు రాజకీయ నేతలకు, మీడియాకు తీరిక లేకుండా గడిచాయని, సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ఇటీవలే ముగిసిన తరుణంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాల్లో తాము నిమగ్నమై ఉన్నవేళ, ఒక విషాద వార్త అందిందని అన్నారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామోజీరావు శనివారం కన్నుమూయడం తననెంతో దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.
రామోజీరావు - బహుముఖ ప్రజ్ఞాశాలి : తమ మధ్య ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా వ్యక్తిగతంగా ఇది తనకు తీవ్ర నష్టం కలిగించిందని మోదీ ఉద్ఘాటించారు. రామోజీరావు గురించి ఆలోచించగానే తన మనసులో ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి మెదిలారని కొనియాడారు. ఆయనకు ఆయనే సాటని, వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన భిన్న రంగాల్లో అద్భుతంగా రాణించారని తెలిపారు.
సినిమాలు, వినోదం, మీడియా, వ్యవసాయం, విద్య, ఇలా రంగం ఏదైనా తనదైన ముద్ర వేశారని శ్లాఘించారు. అయినా జీవితపర్యంతం ఆయనలో వినమ్రత సడలలేదని, అలాగే మూలాలను ఎన్నడూ విస్మరించలేదన్నారు. ఈ గొప్ప లక్షణాలే ఆయనను అనేక మందికి ఆత్మీయుడిని చేశాయని తన వ్యాసంలో మోదీ పేర్కొన్నారు.
PM Modi Essay on Ramoji Rao : మీడియా రంగంలో రామోజీరావు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్న ప్రధాని, నిబద్ధత, నవ్యత, అసమాన పనితీరు వంటి అంశాల్లో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారని కొనియాడారు. ఆయన కాలానుగుణంగా నడుచుకున్నారన్న మోదీ, కాలంకన్నా వేగంగానూ పరుగులు తీశారని కితాబిచ్చారు. పత్రికలే ప్రధాన వార్తా వనరుగా ఉన్న కాలంలో ‘ఈనాడు’ దినపత్రికను స్థాపించారని తెలిపారు.
1990లలో భారత్‌లో టీవీల సందడి ప్రారంభం కాగానే ఈటీవీతో ఆయన తనదైన ముద్రవేశారని తన వ్యాసంలో చెప్పుకొచ్చారు. తెలుగు లాంగ్వేజ్తోపాటు ఇతర భాషా ఛానళ్లనూ ప్రారంభించడం ద్వారా ‘ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తి పట్ల తన నిబద్ధతను చాటుకున్నారని మోదీ తన దేశ భక్తిని వివరించారు.