Highest Temperature in Vikarabad : రాష్ట్రంలో భానుడి ప్రకోపం అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు రోజురోజుకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా మరోవైపు వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా వికారాబాద్ జిల్లా తాండూర్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో 44 డిగ్రీలకు పైబడి నమోదవుతున్నాయి. మే నెలలో ఎండలు ఇంకా ఎక్కువగా పెరుగుతుండటంతో ప్రజలు వడదెబ్బకు గురై చనిపోతున్నారు.
సిమెంటు కర్మాగారాలు, నాపరాళ్ల గనులు ఉండే తాండూరులో వేడి వాతారణం సహజంగానే ఎక్కువ. అలాంటిది ఇప్పుడు భరించలేని వేడితో మరింత అవస్థ పడుతున్నారు. పరిగి, వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాల్లోనూ ఎక్కువగా నమోదౌతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు భయపడుతున్నారు. సహజంగా 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే ఆరెంజ్ జోన్‌గా ప్రకటిస్తారు.అలాంటిది జిల్లాలో 44 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆరెంజ్ జోన్‌లోకి వెళ్లిందని అధికారులు ప్రకటించారు.
ఎండలు బాబోయ్ ఎండలు - అడుగు బయట పెడితే సెగలే సెగలు - HIGH TEMPERATURE IN TELANGANA
గత ఏప్రిల్ 28న తాండూరు పట్టణంలోని రైల్వేస్టేషన్లో ఒకరు , బస్టాండ్‌లో ఒకరు ఎండ వేడి భరించలేక చనిపోయారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వచ్చి చూసిన వారు వడదెబ్బతో మృతి చెందినట్లు చెప్పారు. కర్ణాటక రాష్ట్రం సేడంకు చెందిన ఉపాధ్యాయురాలు రాణి బషీరాబాద్ మండల కేంద్రంలోని టాకీ తండా ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ నెల 1న తాండూరు పట్టణంలోని ఓ పాఠశాలలో ఎలక్షన్ శిక్షణ సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం సాయంత్రం బషీరాబాద్ వెళ్లేందుకు బస్టాండ్‌కు చేరుకున్నారు. తలనొప్పిగా ఉందని తోటి ఉపాధ్యాయురాలికి తెలిపిన కొద్ది సేపటికే స్పృహ కోల్పోయారు. వెంటనే ఆమెను తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని తెలిపారు. వడదెబ్బతో ఉపాధ్యాయురాలు మృతి చెందడంతో తోటి ఉపాధ్యాయులు ఆవేదన చెందారు.
ఎండల తీవ్రత దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే :
ఉదయం 6 నుంచి 9 గంటల లోపే బయటి పనులను పూర్తి చేసుకోవాలి. లేదంటే రాత్రి 8గంటల తర్వాత బయటికి వెళ్లాలి.
తోపుడు బండ్లపై తిను బండారాలు, ఇతరత్రా వస్తువులను విక్రయించే వారు చెట్లనీడను ఆశ్రయించాలి.
వడగాలులు ఎక్కువగా వీస్తుండటంతో వడదెబ్బకు గురయ్యే ప్రమాదాలున్నాయి.
ఎటు వెళ్లినా వాటర్ బాటిల్ వెంటతీసుకొని వెళ్లాలి. తరచూ కొద్ది కొద్దిగా నీరు తాగుతూ ఉండాలి.
ఎండలో తప్పనిసరై బయటకు వెళ్లాల్సి వస్తే టోపీలు ధరించాలి.
వేడిని నిరోధించే కాటన్ దుస్తులను వేసుకోవాలి.
వేడి వాతావరణం వల్ల శరీరం నుంచి చెమట ఎక్కువగా బయటికి వెళ్లినపుడు లీటరు నీటిలో ఓఆర్ఎస్ ప్యాకెట్ కలిపి తాగాలి.
నిప్పులు కురిపిస్తున్న భానుడు - ఆల్‌టైం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు - high temperatures in telangana