Prathidhwani : మేనిఫెస్టో అంటే వచ్చే ఐదేళ్లు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై లిఖిపూర్వక హామీపత్రం. అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళతామన్నది ఆవిష్కరించే భవిష్యత్ ప్రణాళిక. 2019 నాటి మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో పోల్చిన జగన్ అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచిపోయారు. అరకొర సంక్షేమంతో ప్రజల్ని మభ్యపెట్టారు. ఇటీవల విడుదల చేసిన 2024 మేనిఫెస్టోతోనూ ప్రజల్నే కాదు వైఎస్సార్సీపీ శ్రేణులనూ ఉసూరుమనిపించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు కొంగొత్త ఆశలు కల్పిస్తూ తెలుగుదేశం కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. సూపర్‌సిక్స్ పథకాలకు తోడు మరో 36 హామీలను జోడిస్తూ పూర్తిస్థాయి ప్రణాళికను వెల్లడించింది. కూటమి మేనిఫెస్టో రాష్ట్రాభివృద్ధి, సంక్షేమానికి ఏవిధమైన ప్రణాళికను ఆవిష్కరించింది? ఏ వర్గానికి ఎలాంటి భరోసాను ఇస్తోంది? మేనిఫెస్టో అమలుకు అవసరమైన నిధుల్ని ఏవిధంగా సమీకరించాల్సి ఉంటుంది? ఈ అంశాలపై చర్చించేందుకు ఇద్దరు ప్రముఖులు మనతో ఉన్నారు. కూటమి మేనిఫెస్టో కొత్త ఆశలు అంశం పై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు, సీనియర్ పాత్రికేయులు, డి.వి. శ్రీనివాస్ పాల్గొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
NDA Manifesto 2024 : టీడీపీ, జనసేన మ్యానిఫెస్టో సూపర్ హిట్! అది కేవలం ఎన్నికల మ్యానిఫెస్టో మాత్రమే కాదు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు దర్పణం! అభివృద్ధినీ, సంక్షేమాన్నీ సమతుల్యం చేస్తూ రాష్ట్ర భవిష్యత్తుకు మేలు బాటలు వేసేందుకు రూపొందించిన దార్శనిక పత్రం! అణగారిన వర్గాలకు ఆర్థికంగా అండగా నిలుస్తూ, వారి సామాజిక అభ్యున్నతికి భరోసానిచ్చేందుకు ఎంతో శ్రద్ధతో రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ! ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీవర్గాల వారికి నెలకు రూ.4 వేల చొప్పున 50 సంవత్సరాలకే పింఛను, ప్రతి కుటుంబానికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా, ఉచిత ఇసుక, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, పేదలకు గృహ నిర్మాణానికి గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం వంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలు దానిలో ఉన్నాయి.
వైఎస్సార్సీపీ ఐదేళ్ల అరాచక పాలనలో విధ్వంసానికి గురైన వ్యవస్థల్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు, దెబ్బతిన్న వర్గాలకు భరోసానిచ్చేందుకు మ్యానిఫెస్టోలో విస్తృత కసరత్తు చేశారు. మిత్రపక్షం భాజపా సూచనలు, సలహాలకు ప్రాధాన్యమిస్తూ, తెెదేపా, జనసేనలు మంగళవారం విడుదల చేసిన సంయుక్త మ్యానిఫెస్టోతో ఎన్‌డీయేలోని మూడు పార్టీల్లో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ఆ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళితే చాలు ఎన్‌డీయే ఘన విజయం ఖాయమన్న భావన వ్యక్తమవుతోంది. తెదేపా ఆవిర్భావం నుంచి పార్టీకి వెన్నెముకగా ఉన్న బీసీలకు మ్యానిఫెస్టోలో పెద్దపీట వేశారు. మహిళా సాధికారతకు, వారి ఆర్థిక స్వావలంబనకు, యువత ఉపాధికి, అభ్యున్నతికి విశేష ప్రాధాన్యమిచ్చారు. ఉద్యోగులు, వ్యాపారులతో పాటు అన్ని వర్గాల మధ్య సమతూకం పాటిస్తూ, భవిష్యత్తుకు భరోసానిస్తూ, సముచిత అవకాశాలు కల్పిస్తామన్న నమ్మకం కలిగిస్తూ విస్తృత కసరత్తు చేసి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. జనసేన ‘షణ్ముఖ వ్యూహాన్ని’ మేళవించి తెదేపా సూపర్ సిక్స్ పేరుతో విడుదల చేసిన మినీ మ్యానిఫెస్టో ఇప్పటికే విశేషంగా ప్రజల ఆదరణ చూరగొనగా, ఇప్పుడు విడుదల చేసిన పూర్తిస్థాయి మ్యానిఫెస్టో మరింత సమగ్రంగా, సంపూర్ణంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.