Seven Maoists Killed in Mulugu Encounter : ములుగు జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఆదివారం తెల్లవారుజామున ఏటూరునాగారం మండలం చెల్పాక అటవీ ప్రాంతం తుపాకీ మోతలతో దద్దరిల్లింది. పచ్చని అటవీ ప్రాంతం నెత్తురోడింది. మావోయిస్టులకు-కూంబింగ్ దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. మృతి చెందిన ఏడుగురు మావోయిస్టుల్లో ఇల్లందు, నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్సం మంగు అలియాస్ భద్రు అలియాస్ పాపన్న, జిల్లా కమిటీ సభ్యుడు ఏగోలపు మల్లయ్య అలియాస్ కోటి, ఏరియా కమిటీ సభ్యులు జమున, కరుణాకర్గా పోలీసులు గుర్తించారు. మిగిలిన ముగ్గురిని ఇంకా గుర్తించాల్సి ఉంది.
మృతదేహాల తరలింపులో హైడ్రామా : కుర్సం మంగు, అలియాస్ భద్రుపై రూ.20 లక్షల రివార్డు ఉన్నట్లు జిల్లా ఎస్పీ శబరీష్ తెలిపారు. పూలకొమ్మ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న గ్రౌండ్స్ బలగాలపై మావోయిస్టులు దాడి చేయడంతో ఆత్మ రక్షణ నిమిత్తం కాల్పులు జరిపామని తెలిపారు. మావోయిస్టుల మృతదేహాల తరలింపులో హైడ్రామా చోటుచేసుకుంది. తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగినా, రాత్రి ఏడు గంటల వరకూ మృతదేహాల తరలింపు జరగలేదు. తొలుత ములుగు ఏరియా ఆసుపత్రికి మృతదేహాలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఫ్రీజర్లను సైతం సిద్ధం చేశారు. ఆఖరి నిమిషంలో రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో ఏటూరునాగారం సామాజిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇవాళ ఫోరెన్సిక్ వైద్యులు శవ పరీక్షలు నిర్వహించిన అనంతరం, మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.
అన్నంలో విషం పెట్టి - ఆపై చిత్రహింసలకు గురి చేసి : నేటి నుంచి వారం రోజుల పాటు పీపుల్స్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాలు జరుగుతాయని మావోయిస్టులు ముందే ప్రకటించగా, దానికి ఒకరోజు ముందే ఈ ఘటన జరగడంతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ములుగు ఎన్కౌంటర్ ఘటనపై తెలంగాణ పౌరహక్కుల సంఘం నేతలు పలు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. పోలీసులెవ్వరికీ గాయాలు కాలేదని, అసలు ఎన్కౌంటర్ జరిగినట్లు లేదని, అన్నంలో విషం పెట్టి, స్పృహ కోల్పోయిన తర్వాత చిత్రహింసలకు గురి చేసి కాల్చి చంపారని సంఘం నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్కౌంటర్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో వైద్య పరీక్షలు జరగాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటనా స్ధలం నుంచి ఆయుధాలు, కిట్ బ్యాగులు, మావోయిస్టు విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్- 36 మంది మావోయిస్టులు మృతి - Chhattisgarh Encounter Today