Population Of Telugu Living People in Other States : తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల్లో స్థిరపడ్డ తెలుగువారి జనాభాను కావాలనే తగ్గించి చూపిస్తున్నారని, జనగణనలోనూ లోపాలున్నాయని రాష్ట్రేతర తెలుగువారు ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడులోని ప్రతి జిల్లాలో సుమారు 30 శాతం వరకు తెలుగువారు ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా 5.6 శాతమే ఉన్నట్టు ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఒకప్పుడు తెలుగు ఓ వెలుగు వెలిగిన ప్రాంతాల్లో నేడు పరిస్థితులు దిగజారుతున్నాయని వాపోయారు.
వివిధ రాష్ట్రాల్లోని తెలుగు సంఘాలను సంప్రదించి, భావితరాలకు తెలుగు నేర్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దీనికోసం ఏకీకృత సిలబస్‌తో పుస్తకాలు తయారు చేయడంతో పాటు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు రాష్ట్రేతరాంధ్రుల సమాఖ్య ప్రతినిధులు వెల్లడించారు. ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహాసభల సందర్భంగా ఆదివారం రాష్ట్రేతరాంధ్రుల సమాఖ్య అధ్యక్షుడు రాళ్లపల్లి సుందరరావు అధ్యక్షతన ఇతర రాష్ట్రాల్లోని తెలుగు ప్రతినిధుల సదస్సు నిర్వహించారు.
"ప్రజల భాషలోనే న్యాయపాలన జరగాలి"- మహాసభల వేదికగా పిలుపునిచ్చిన న్యాయమూర్తులు
"వందల ఏళ్లుగా ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డ తెలుగువాళ్లు తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నారు. సుందరరావు క్రమంగా సుందరరామన్‌గా, రాధాకృష్ణ రాధాకృష్ణన్‌గా మారిపోతున్నారు. పశ్చిమబెంగాల్‌లో సిర్థపడ్డ తెలుగువాళ్లు 30 ఏళ్ల కిందటి వరకూ తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నారు. అక్కడ ఎన్నో పాఠశాలల్ని మనవాళ్లు నిర్మించి, నిర్వహించారు. ఇటీవల ఇంగ్లిష్ చదువులపై మోజుతో తెలుగు మాధ్యమంలో పిల్లల్ని చేర్చడం లేదు. చాలా తెలుగు బడులు మూతపడ్డాయి. అయినా నేటికీ 12వ తరగతి వరకు తెలుగు ఓ పాఠ్యాంశంగా కొనసాగుతోంది." - ఆర్.సుందరరావు, ఖరగ్‌పుర్
"తమిళనాడులో తెలుగువారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నాం. నిర్బంధ తమిళంతో మైనార్టీ భాషలను అక్కడి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. తెలుగు పాఠ్యపుస్తకాలను సరఫరా చేయడం లేదు. తెలుగు పాఠ్యాంశంగా ఉన్నా, మార్కులు వేయడం లేదు. ఉపాధ్యాయులే తెలుగు విద్యార్థుల్ని నిరుత్సాహపరుస్తున్నారు. తెలుగు పుస్తకాల కోసం ఇండెంట్ పంపొద్దని పాఠశాలలకు అనధికారికంగా ఆదేశాలిచ్చింది." - సీతారామయ్య, హోసూరు
"నగరీకరణ వల్ల గుజరాత్‌లో తెలుగు వాళ్లు చెదిరిపోతున్నారు. ఇప్పటికీ అక్కడ తెలుగు వాగ్గేయకారుల జయంతులు, పండుగలు నిర్వహిస్తున్నాం." - పీవీపీసీ ప్రసాద్, అహ్మదాబాద్
"ఒడిశాలోని చాలా తెలుగు పాఠశాలల్లో తెలుగు బోధించే ఉపాధ్యాయుల్లేరు. ప్రభుత్వం కొత్తవారిని నియమించడం లేదు. అయినా, తెలుగు పాఠ్యపుస్తకాల కోసం విద్యార్థులకు నిధులిస్తోంది." - శొంఠి నాగేశ్వర శ్రీనివాస్, భువనేశ్వర్
"ఒక్క బెంగళూరు నగరంలోనే 19 శాతం తెలుగు వారున్నారు. కానీ కర్ణాటక మొత్తం 30 లక్షలే ఉన్నారని తప్పుడు లెక్కలు చెబుతున్నారు."
- రాజులపల్లి ప్రతాప్, బెంగళూరు
"వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారి సమస్యలను అధ్యయనం చేయాలి. ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు ఇందుకు బాధ్యత తీసుకోవాలి."
- సత్యనారాయణమూర్తి, బ్రహ్మపుర, ఒడిశా
'భాషా పరిశోధన స్థాయి దిగజారింది - డబ్బులుంటే డాక్టరేట్లు కొనే పరిస్థితి వచ్చింది'
కవితా ధోరణిలో మాట్లాడగలిగే అందమైన భాష తెలుగు : జస్టిస్ ఎన్.వి. రమణ