Polling Ends Amid Tensions: గుంటూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జోరుగా సాగింది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు గంటల తరబడి వేచి చూసి మరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వృద్ధులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటును వినియోగించుకుంటున్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పోలింగ్ పెద్ద ఎత్తున నమోదైంది. అక్కడక్కడ వైసీపీ నేతలు, టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఓటర్లను ఐవిఆర్ఎస్ కాల్స్ తో ముఖ్యమంత్రి జగన్, మంత్రి విడుదల రజిని ప్రలోభాలకు గురి చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సీఎం జగన్, మంత్రి విడుదల రజిని పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుల పేర్కొన్నారు. ఇదే కాపీని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ మీనాకు పంపించారు.
వైసీపీ నేత గుంటూరు పశ్చిమ అభ్యర్థి విడదల రజిని పోలింగ్ కేంద్రంలో హల్చల్ చేశారు. ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని తగ్గించేందుకు విడదల రజిని ప్రయత్నం చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఏటి అగ్రహారంలోని ఎస్.కె.బి.ఎం స్కూల్ వద్ద ఉన్న టీడీపీ పోలింగ్ ఏజెంట్‌పై మంత్రి రజిని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ పోలింగ్ ఏజెంట్‌పై ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా తన అనుచరగణంతో అక్కడున్న టీడీపీ నేతలు, కార్యకర్తలపై దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.
దెబ్బకు దెబ్బ - ఓటరును కొట్టిన ఎమ్మెల్యే - తిరిగి చెంప చెల్లుమనిపించిన ఓటర్ - VOTER SLAPS MLA IN AP
గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు మూకమ్మడి దాడికి పాల్పడ్డారు. ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ ముందే వైసీపీ నాయకులు దాడులకు పాల్పడటం పై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడు గింజుపల్లి శివరామ ప్రసాద్ ని చొక్కా పట్టుకుని లాక్కెళ్లారు. పోలీస్ స్టేషన్ ఎదుటనే వైసీపీ నాయకుల రెచ్చిపోతుంటే పోలీసులు పట్టించుకోలేదని టీడీపీ నేతలు ఆరోపించారు.
తమకు ఓటు హక్కు కల్పించాలంటూ గుంటూరు జిల్లా మంగళగిరి ఆర్వ కార్యాలయం వద్ద ఆరో బెటాలియన్ పోలీసులు ఆందోళనకు దిగారు. ఈనెల 7, 8, 9 తేదీల్లోలో జరిగిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సమయంలో వీరు మహారాష్ట్రలో ఎన్నికల్లో విధులు నిర్వహించారు. 140 మంది పోలీసులు వేరే రాష్ట్రంలో విధుల్లో ఉన్నందున తాము ఓటు హక్కు వినియోగించుకోలేదని తమకు మళ్ళీ అవకాశం కల్పించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి విన్నవించుకున్నారు. ఎన్నికల అధికారులు ఈనెల 13న వచ్చి ఓటు వేయాలని పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన పోలీసులు ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ లోకి వెళ్ళగా, అక్కడ వారికి ఓటు హక్కు లేదని అధికారులు వారిని తిప్పి పంపించారు. దీంతో ఎన్నికల అధికారుల తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ రెచ్చిపోయారు. ఓటరుపై వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ దాడికి తెగబడ్డారు. ఐతనగర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేయటానికి వెళ్లిన ఎమ్మెల్యే, క్యూ పద్ధతి పాటించకుండా నేరుగా లోపలికి వెళ్లబోయారు. దీనిపై అభ్యంతరం చెప్పిన ఓటరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే విచక్షణ మరిచి చెంపపై కొట్టారు. వెంటనే ఓటరు కూడా ఎమ్మెల్యే శివకుమార్ చెంప చెళ్లుమనిపించారు. దీంతో ఎమ్మెల్యే అనుచరమూక ఓటరుపైన విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటపై ఎన్నికల సంఘం స్పందించింది. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. పోలింగ్ పూర్తయ్యే వరకు శివకుమార్‌ను గృహనిర్బంధంలోనే ఉంచాలని పేర్కొంది.
రాష్ట్ర ప్రజలు ఓటు ద్వారా వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పనున్నారని తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. ముఖ్యమంత్రిని చూసి వైసీపీ శాసనసభ్యులు కూడా దాడులతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. సామాన్యమైన ఓటర్ పై ఎమ్మెల్యే దాడి చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ఓటర్లను కొట్టి ఆ ఘటన నుంచి తప్పించుకునేందుకు కులాలు మతాలు రెచ్చగొట్టడం బాధాకరమన్నారు. ఓటర్ పై దాడిని ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా తీసుకుందన్నారు.
పోలింగ్ కేంద్రం వద్ద మంత్రి విడుదల రజిని హల్చల్ - VIDADALA RAJINI HALCHAL