Political Leaders Cast Their Vote in AP : ఏపీలోని లోక్‌సభ, అసెంబ్లీ పరిధిలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓటర్లు ఉదయాన్నే వేలాదిగా పోలింగ్ బూత్‌ల వద్దకు తరలి వచ్చారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ రైల్వే కల్యాణ మండపంలోని పోలింగ్ కేంద్రంలో సీఈవో ముఖేష్‌కుమార్ మీనా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతోపాటు మొబైల్ ఫోన్లు పోలింగ్ కేంద్రంలోకి అనుమతించబోమని వెల్లడించారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని ఓటర్లను కోరారు.
"ఓటర్లెవరూ పోలింగ్ కేంద్రాలకు మొబైల్ ఫోన్లు తేవద్దు. మొబైల్ ఫోన్లు పోలింగ్ కేంద్రంలోకి అనుమతించం. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం. శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలి." - ముఖేష్‌కుమార్ మీనా, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
ఓటు వేసిన వైఎస్ జగన్, చంద్రబాబు : గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ విజయవాడ రైల్వే కల్యాణ మండపంలోని పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. ముఖ్యమంత్రి జగన్ దంపతులు వైఎస్సార్ జిల్లా పులివెందుల బాకరాపురం పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లా ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంగళగిరిలో పవన్‌కల్యాణ్ ఓటు వేసి ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
నందిగామలో టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య, అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం నగిరిపల్లి 181 పోలింగ్ కేంద్రంలో మాజీ సీఎం రాజంపేట ఎంపీ బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడు పీలేరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి నల్లారి కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.