Police Seized Rs. 7 Crores: ఎన్నికల కోడ్ రాకముందే నెల్లూరు జిల్లా పోలీసులు నగదు అక్రమ రవాణపై దృష్టి సారించారు. పోలీసుల కళ్లుగప్పి బంగారాన్ని స్మగ్లింగ్ చేద్దామనుకున్న ముఠాల గుట్టు రట్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మార్గాల ద్వారా బంగారం కొనుగొలు కోసం నగదు అక్రమ రవాణ చేస్తున్న 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 7.23 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
రూ. 7.23 కోట్ల నగదు సీజ్ చేసిన పోలీసులు: నెల్లూరు జిల్లాలో భారీగా డబ్బు పట్టుబడింది. బంగారం వ్యాపారులకు సంబంధించి రూ. 7.23 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలీసులు నెల్లూరు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసుల తనిఖీల నేపథ్యంలో భారీగా నగదు పట్టుబడింది. పక్కా సమాచారంతో నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద రూ.4.38 కోట్లు, రైల్వే స్టేషన్ వద్ద రూ. 1.44 కోట్లు, వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ఒక కోటి 40 లక్షల రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు.
బంగారం అక్రమ రవాణా: నెల్లూరు నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నగదు తరలిస్తున్న మెుత్తం 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ పట్టుబడిన డబ్బు అంతా రాజమండ్రి, కాకినాడ, నరసరావుపేట, పల్నాడు జిల్లాలకు చెందిన బంగారు వ్యాపారులకు సంబంధించినదిగా పోలీసులు గుర్తించారు. రాజమండ్రి, కాకినాడల నుంచి ట్రైన్లో నెల్లూరుకు చేరుకున్న వారంతా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు నెల్లూరు నుంచి వాహనంలో చెన్నైకి వెళుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నగదు తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు కట్టకుండా అక్రమ మార్గంలో బంగారు కొనుగోలు చేసేందుకే ఈ నగదు తరలిస్తున్నట్లు నెల్లూరు నగర, రూరల్ డిఎస్పీలు శ్రీనివాస రెడ్డి, వీరాంజనేయరెడ్డిలు తెలిపారు. నగదుకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారమిచ్చినట్లు పోలీసులు తెలిపారు.
తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు.. మునుగోడుకి తరలిస్తుండగా భారీగా పట్టుబడిన నగదు
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాం . ఈ తనిఖీల్లో సుమారు 15 మంది వ్యక్తుల వద్ద 7.23 కోట్ల నగదు పట్టుకున్నాం. బంగారం వ్యాపారులు వివిధ జిల్లాల నుంచి నెల్లూరు జిల్లాకు వచ్చి అక్కడి నుంచి తమిళనాడులో నుంచి బంగారం తరలిస్తారు. జీఎస్టీని ఎగ్గొట్టేందుకు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. బంగారం వ్యాపారం చేసే వ్యాపారులు ఎవ్వరైనా అక్రమంగా బంగారు వ్యాపారం చేయకూడదని హెచ్చరిస్తున్నాం. సామాన్యులు సైతం ఎన్నికల నేపథ్యంలో డబ్బులను వెంటబెట్టుకొని ప్రయాణాలు చేయకూడదు. పోలీసులకు పట్టుబడితే సామాన్యులు సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. -శ్రీనివాస రెడ్డి, నెల్లూరు నగర డీఎస్పీ