Arrangements For Bakrid Festival in Telangana 2024 : తెలంగాణలో సోమవారం నాడు బక్రీద్ సందర్భంగా అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించే ఈద్గాలు, మసీదుల్లో తగు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ప్రత్యేక ప్రార్ధనలు జరిగే మీరాలం ఈద్గా పరిసర ప్రాంతాల్లో వాహనాలను వేరే మార్గాలకు మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు.
పాతబస్తీలో సోమవారం నాడు సుమారు 1000 మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని పోలీసులు తెలిపారు. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించే మీరాలం ఈద్గా వద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రార్ధనలకు సుమారు 30,000ల మందికి పైగా హజరయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. మరోవైపు ఇప్పటికే బక్రీద్ కోసం ఇప్పటికే అన్ని శాఖల అధికారులు, మత పెద్దలతో హైదరబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించారు.
Bakrid Festival 2024 : పశువులను తరలించే వాహనాలను తనిఖీ చేసేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల 23, కమిషనరేట్ పరిధిలో 60కి పైగా చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. అదేవిధంగా పండుగ రోజు జంతువుల వ్యర్ధాలను తరలించేందుకు అదనపు వాహనాలను ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీని కోరామని చెప్పారు. వ్యర్థాలను వేసేందుకు ప్లాస్టిక్ బ్యాగులను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మీరాలం ఈద్గా వద్ద ప్రార్ధనల ఏర్పాట్ల కోసం జీహెచ్ఎంసీ, వక్ఫ్‌బోర్డు సహకారంతో ముందుకు వెళ్తున్నట్లు పోలీసులు చెప్పారు.
హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు : హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పాతబస్తీలోని పలు రోడ్లపై వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నట్లు చెప్పారు. ఉదయం 8:00 గంటల నుంచి 11:30 గంటల వరకు మీరాలం ఈద్గా ప్రాంతంలో వాహనాలను వేరే మార్గాలకు మళ్లించనున్నట్లు వివరించారు. బహదూర్‌పురా క్రాస్ రోడ్ మీదుగా ఉదయం 8:00 గంటల నుంచి 11:30 గంటల మధ్య పురానాపూల్, కామాటిపురా, కిషన్‌బాగ్ వైపు నుంచి ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చే వారిని మాత్రమే అనుమతించనున్నారు. ఇందుకోసం జూ పార్కు, మసీద్ అల్హా హో అక్బర్ ఎదురుగా వారి వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు.
అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని బక్రీద్ పర్వదినాన్ని ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎవ్వరూ కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని ఆయన పేర్కొన్నారు. మరోవైపు పండుగ నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీలోపాటు పలు మార్కెటల్లో గొర్రెలు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కొనుగోలు దారులతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి.
Bakrid Festival Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బక్రీద్ పర్వదిన వేడుకలు