YSRCP Leaders Attack on TDP Activists: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి రెండు వారాలు దాటింది. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా పనిచేసే అవకాశం అధికారులకు ఉంది. కానీ పోలీసు శాఖ మాత్రం అధికార పార్టీ నేతల కబంధ హస్తాల నుంచి బయటకు రావడం లేదు. వైసీపీ మూక చేసే అరాచకాలను చూసీచూడనట్లుగా వ్యవహరిస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు.
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వైసీపీ నేతలు రెచ్చిపోయి మరీ చేస్తున్న దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తినే దెబ్బతీస్తోంది. అన్యాయంపై ప్రశ్నించే వారిపై కర్రలు, రాళ్లు, ఆయుధాలతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. ఈసీకి ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిని వెతుక్కుంటూ వచ్చి దాడులకు తెగబడుతున్నారు.
గన్నవరం, గుడివాడ, నందిగామ, విజయవాడ తూర్పు ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ అధికారపార్టీ నేతల తీరు ఇలాగే ఉంది. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు వైసీపీ నేతలు చెప్పినట్లే కేసులు నమోదు చేస్తున్న తీరు చూస్తే అసలు ఎన్నికల షెడ్యూల్ వచ్చిందా? అన్న అనుమానం కలుగుతోంది.
కోడ్ అమల్లోకి వచ్చినా టీడీపీ నేతలపై పోలీసుల ఒవరాక్షన్! - Police Attack on TDP leaders
నందిగామలో రెండు రోజుల కిందట కిశోర్, నరసింహారావులపై అకారణంగా రాడ్లు, పైపులతో వైసీపీ మూక దాడి చేసి, చావబాదినా పోలీసుల స్పందన అంతంతమాత్రమే. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారన్నందుకు రెచ్చిపోయి వారిపై దాడికి తెగబడ్డారు ఎమ్మెల్యే జగన్మోహన్‌రావు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ అనుచరులు. నందిగామ ఘటన విషయంలో స్పష్టంగా పోలీసుల వైఫల్యం కనిపిస్తోంది. దాడికి గురైన ఇద్దరిలో కిశోర్ తలకు తీవ్ర గాయమైంది. నందిగామ పోలీసులు మాత్రం తూతూమంత్రంగా బెయిలెబుల్ సెక్షన్ కింద కేసు కట్టారు. పైగా దాడి చేసిన వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధితులపైనే ఎదురు కేసు పెట్టారు.
తమకు గాయాలయ్యాయని, నిందితులు ఆసుపత్రిలో చేరి ఫిర్యాదు చేస్తే దానిని పోలీసులు పరిగణలోకి తీసుకుని కేసు పెట్టడం ఖాకీల పక్షపాత వైఖరికి తార్కాణంగా నిలుస్తోంది. మంగళవారం ఉదయం దాడి జరిగితే సాయంత్రం వరకు కేవలం నలుగురు నిందితుల్ని మాత్రమే గుర్తించినట్లు తెలిసింది. సీసీటీవీలో నిందితులకు నిజంగా దెబ్బలు తగిలాయా? అని ప్రశ్నిస్తే పోలీసుల నుంచి సమాధానం లేదు.
ఎన్నికల ప్రచారంలో పచ్చి అబద్ధాలు- ఓట్ల కోసం ఇంతగా దిగజారాలా జగన్? - CM Jagan Election Campaign
ఇంకా పరిశీలించాల్సి ఉందని చెప్పి దాట వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు కమిషనర్ కాంతిరాణా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నట్లు టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. నందిగామ ఘటన సీసీ టీవీ ఫుటేజీలోని దృశ్యాలు పరిశీలిస్తే ఎంత పాశవికంగా తెలుగుదేశం సానుభూతిపరులపై దాడి చేశారో స్పష్టంగా కనిపిస్తోంది.
కానీ దాడిచేసిన వాళ్లే తిరిగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బాధితులపై ఫిర్యాదులు చేశారు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జగన్మోహన్‌రావు, అతని సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ చెప్పిందే రాజ్యాంగం. పోలీసులు కూడా వారి ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ కేసులు నమోదు చేస్తూ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు.