Medchal jewellery shop robbery case: నగల దుకాణాలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. దోపిడీ జరిగిన 24 గంటల్లోపే పోలీసులు కేసును చేధించారు. ముగ్గురు సభ్యుల ముఠాలో ఇద్దరు పోలీసులకు చిక్కగా మరొకరు పరారీలో ఉన్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
సంచలనం సృష్టించిన నగల దుకాణంలో దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు 24 గంటల్లో చేధించారు. ఇద్దరు దోపిడీ దొంగల ముఠాను అరెస్టు చేశారు. ఈ నెల 20 న మేడ్చెల్ లోని జగదంబ నగల దుకాణం లోకి చొరబడిన ఇద్దరు దుకాణం యజమానితో పాటు అక్కడ పనిచేసే వ్యక్తిని కత్తులతో బెదిరించి దోపిడీకి యత్నించారు. వారు కేకలు వేసి తిరబడే క్రమంలో పనిచేసే వ్యక్తికి గాయాలయ్యాయి. నిందితులు తాము వచ్చిన ద్విచక్ర వాహనంపైనే పరారయ్యారు. నజీమ్ అజీజ్ కోటాడియా, షేక్ సోహైల్, సల్మాన్ వీరంతా మహారాష్ట్ర ముంబాయి వాసులు కాగా వ్యాపారం కోసం చాలా రోజుల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. అయితే ప్రధాన నిందితుడు అజీజ్ వ్యాపారంలో నష్టపోవడంతో కొద్ది రోజులు ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేశాడు. రెండు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి ర్యాపిడో ద్వారా నడిపించినప్పటికీ ఆదాయం సరిపోకపోవడంతో నేరాలకు పాల్పడాలని భావించాడు. ఇదే విషయాన్ని తన స్నేహితులు సోహైల్, సల్మాన్‌కు చెప్పాడు. ముగ్గురు కలిసి నగల దుకాణాలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు, దొంగతనాలకు పాల్పడాలని నిర్ణయించారు.
జువెలరీ షాపులోకి చొరబడ్డ ముసుగు దొంగలు - యజమానిని కత్తితో పొడిచి డబ్బుతో పరార్
ఇటీవల చాదర్‌ఘాట్ ప్రాంతంలో వీరు ముగ్గురు కలిసి నగల దుకాణంలో దోపిడీకి పాల్పడ్డారు. ఈ కేసులో వీరు అరెస్టయి జైలుకు వెళ్లి తిరిగి వచ్చారు. మరో సారి శివార్లలో ఇదే తరహాలో దోపిడీలు చేయాలని భావించి కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట, ఉప్పల్, బోడుప్పల్, కార్వాన్, బోరబండ, మలక్‌పేట్, అంబర్‌పేట్, మేడ్చెల్ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. మేడ్చెల్‌లోని జగదంబ నగల దుకాణంలో దోపిడీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు నిందితులు ద్విచక్ర వాహనాన్ని దొంగిలించి పథకం ప్రకరాం దోపిడీ చేయడానికి నగల దుకాణానికి వచ్చారు. ముఠాలోని సల్మాన్ దుకాణం బయట ఉండగా మిగితా ఇద్దరు లోనికి ప్రవేశించారు. తమను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు బుర్భా ధరించారు. నిందితులు కత్తితో నగల దుకాణంలో ఉన్న వ్యక్తి పై దాడికి దిగారు. వారు కేకలు వేయడంతో పరారయ్యారు. అయితే వారిని పట్టుకునేందుకు పోలీసులు 16 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలతో పాటు సీసీ కెమారా దృశ్యాల ఆధారంగా దోపిడీకి పాల్పడింది పాత నేరస్తుల ముఠా అని గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి బుర్ఖాతో పాటు చేతి గ్లౌజులు, రెండు చరవాణులు, ద్విచక్ర వాహనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల పై పలు పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో 9 కేసులు ఉన్నట్టు సీపీ అవినాష్ మహంతి తెలిపారు. అనుమానితులు కనిపిస్తే పోలీసులకు స్థానికులు తక్షనం సమాచారం ఇవ్వాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు. వ్యాపారస్తులందరూ విధిగా సీసీ కెమారాలు ఏర్పాటు చేసుకోవాలని నగల దుకాణం యజమానులు విధిగా భద్రత సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
ఈ నెల20 న జగదాంబ షాప్‌లో ఇద్దరు వ్యక్తులు నగలు, నగదు చోరీ చేశారు. 40 సెకండ్లు మాత్రమే షాప్‌లో ఉండి విధ్వంసం చేశారు. దోపిడీ జరిగిన అనంతరం నిందితుల కోసం 200 సీసీ కెమెరాలు పరిశీలించాం. కిలో మీటరు దూరంలో బైక్ వదిలిపెట్టి పరారయ్యారు. ఓయు, హబ్సిగూడలో బైక్ దొంగలించారు. 16 బృందాలతో రంగంలోకి దిగి పట్టుకున్నాం. అవినాష్ మహంతి, సైబరాబాద్ సీపీ