Ganesh Pandals Guide lines in Hyderabad : గణపయ్య పూజకు వేళ అయింది. మరో 48 గంటల్లోప్రతి ఊరూవాడ జైజై గణేశా అంటూ ఆ విఘ్నేశ్వరుడికి ఘనస్వాగతం పలుకుతారు. అలా తొమ్మిది రోజుల పాటు ఆ లంబోదరుడికి పూజలు చేసి తరిస్తారు. సెప్టెంబరు 7వ తేదీన రానున్న వినాయక చవితికి తెలంగాణ రాష్ట్రం సిద్ధం అవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పల్లె, పట్టణం అనే తేడా లేకుండా గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించడానికి సన్నద్ధం అవుతున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ గణేశుని ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
చిన్నాపెద్దా అంతా మండపాలను ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో బొజ్జ గణపయ్యను పూజిస్తారు. అన్నదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అంటూ వినాయక నవరాత్రులు అంగరంభ వైభవంగా నిర్వహిస్తారు. అయితే విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు అంతా తమకు తెలిసే చేయాలంటూ పోలీసు శాఖ ఆదేశాలు ఇచ్చింది. ఇది అంతా భద్రతలో భాగమే అంటూ చెప్పకనే చెప్పింది. ఆన్లైన్లో దరఖాస్తు మొదలు, నిర్మాణానికి అనుమతి, నిమజ్జనం ఇలా ప్రతిదానికి చట్టపరమైన అనుమతి లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
గణేశ్ మండపం ఏర్పాటు చేసే వారు పాటించాల్సిన రూల్స్ ఇవే:
- ముందుగా మండపం అనుమతి కావాలంటూ పోలీసు శాఖకు దరఖాస్తు చేసుకోవాలి.
- విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదు.
- వినాయక మండపం ఏర్పాటులో అన్ని మన్నిక ఉన్న వస్తువులనే వాడాలి.
- ప్రజల తాకిడి, వర్షం పడితే నీళ్లు నిలవడం, గాలి వీచినప్పుడు ఇబ్బంది కలగడం, కూలిపోకుండా చూడటం వంటి బాధ్యతను కమిటీలే చూసుకోవాలి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
- రాష్ట్ర ప్రభుత్వం గణేశుని మండపాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇస్తోంది.
- విద్యుత్ కనెక్షన్లు, లైట్ల ఏర్పాటుకు నాణ్యమైన పరికరాలను వినియోగించాలి.
- మండపాల పై భాగంలో నీరు పడినా కిందకు జారిపోయే పట్టాలతో కప్పాలి.
- సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినప్పుడు సంబంధిత డీఎస్పీ అనుమతి తప్పనిసరి. లేకపోతే నిర్వహించకూడదు.
- సాంస్కృతి కార్యక్రమాలు చేసేటప్పుడు రాత్రి 10 గంటల వరకు చేపట్టరాదు. ఇతరులకు ఇబ్బందులు తలెత్తకూడదు.
- మండపాల పేరుతో ఎలాంటి లక్కీ డ్రాలు నిర్వహించకూడదు. అలాగే జూదాన్ని నిర్వహించరాదు. ఎలాంటి డబ్బు వసూళ్లకు పాల్పడకూడదు.
- గణేశుని మండపాల వద్ద మద్య నిషేధం అమలు చేయాలి.
- ప్రతి మండపం వారు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించకూడదు.
- మండపాల వద్ద ఎలాంటి టపాసులు కాల్చరాదు. పెద్దపెద్ద శబ్దాలతో డీజేలు ఏర్పాటు చేయకూడదు.
భక్తుల సందర్శనకు క్యూలైన్ విధానం బెస్ట్ : గణేశుని మండపాల వద్ద 24 గంటలు కనీసం ముగ్గురు వాలంటీర్లు విగ్రహంతో పాటు ఉండాలి. వారి వివరాలు ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలి. అక్కడ ఉండే పూజ, ఇతర సామగ్రిని పర్యవేక్షిస్తుండాలి. అత్యవసరం అయితే 100కు కాల్ చేయాలి. ఇంకా అత్యవసరం అయితే జిల్లాల పోలీసు కంట్రోల్ రూమ్ ఫోన్ నంబరుకు సమాచారం ఇవ్వాలి. వినాయకుని ఉత్సవాలను అందరూ సమైక్యంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు కోరారు. ఏదైనా అత్యవసరం ఉంటే పోలీసులకు వాలంటీర్లు, ఇతరులు ఎవరైనా సమాచారం ఇవ్వవచ్చని చెప్పారు. భక్తులు సందర్శించుకునేటప్పుడు క్యూలైన్ విధానం ది బెస్ట్ అని తెలిపారు.
గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్ - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం - FREE CURRENT FOR GANESH PANDALS