Police Found Child Missing Cases : ఓ కుటుంబంలో వ్యక్తి తప్పిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో వర్ణించడానికి మాటలు సరిపోవు. ఆ కుటుంబం అనుభవించే బాధ అంతా ఇంతా కాదు. అదే తప్పిపోయిన వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం ఇంటికి తిరిగొస్తే ఆ ఆనందమే వేరు. ఇప్పుడు తెలంగాణలోనూ కూడా అదే జరుగుతోంది. ఎప్పుడో ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యక్తులు ఇప్పుడు కుటుంబ సభ్యుల చెంతకు చేరుతున్నారు. దీని అంతటికీ కారణం మానవ అక్రమ రవాణా నిరోధక విభాగమే (AHTU). వీరు అదృశ్యమైన వ్యక్తులు ఎక్కడ ఉన్నాసరే వెతికి పట్టుకొచ్చి వారి కుటుంబాల వద్దకు చేర్చి వారి కళ్లలో ఆనందాన్ని చూసేలా చేస్తున్నారు.
ఈ ఏహెచ్‌టీయూ విభాగం తెలంగాణ మహిళా భద్రతా అధీనంలో ఉంది. సుదీర్ఘ కాలంగా కనిపించకుండా పోయిన వారిని గుర్తించేందుకు ఏహెచ్టీయూతో పాటు ఇదే విభాగంలోని షీ సైబర్ ల్యాబ్ కృషి చేసింది. ఈ క్రమంలోనే 27 కేసులు కొలిక్కి వచ్చాయని మహిళా భద్రతా విభాగం డీజీపీ శిఖాగోయెల్ వెల్లడించారు. 2024 నవంబరు నాటికి తెలంగాణలో 22,870 అదృశ్య కేసులు నమోదైతే, వాటిలో 19,191 కేసులు కొలిక్కి వచ్చాయి. ఈ విషయంలో జాతీయ సగటు 51.5 శాతంగా ఉంటే తెలంగాణ సగటు 84.25 శాతం.
అభినవ్ సింగ్‌గా మారిన ఖలీల్ ఘోరి : హైదరాబాద్ కంచన్‌బాగ్‌కు చెందిన 12 ఏళ్ల మహమ్మద్ ఖలీల్‌ఘోరి 2014 ఆగస్టులో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. స్థానిక పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, వారు ఏహెచ్టీయూకు కేసును బదిలీ చేశారు. వారు ఓపెన్-సోర్స్ టూల్స్ సహాయంతో దర్యాప్తును ప్రారంభించారు. ఖలీల్‌ఘోరి ఆధార్‌కార్డు కొత్త మొబైల్ నంబర్‌తో అనుసంధానం అయినట్లు తెలుసుకొని, ఆ ఫోన్ నంబరు యూపీలోని కాన్పుర్ ప్రయాగరాజ్‌కు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి సనేహీసింగ్ దిగా గుర్తించారు. ఆ యువకుడు హైదరాబాద్ నుంచి రైల్లో కాన్పూర్ చేరి, అక్కడ రైల్వే స్టేషన్లో తిరుగుతున్న క్రమంలో చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్కు తరలించగా, 2022లో ఖలీల్ ఘోరిని సనేహీసింగ్ దత్తత తీసుకొని అభినవ్సింగ్గా పేరు మార్చారు. ఈ మేరకు ప్రత్యేక బృందం కాన్పూర్‌కు వెళ్లి యువకుడిని తీసుకొని వచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ విషయం అంతా దర్యాప్తులో తెలిసింది.
బెలూన్ల విక్రయాల ఆధారంగా బాలిక గుర్తింపు : హైదరాబాద్ నాచారంలోని శాంతిసదన్కు చెందిన 11 ఏళ్ల గంగ, 2015 అక్టోబరులో అదృశ్యమైపోయింది. కానీ అప్పట్లో గంగ కేవలం బెలూన్లు మాత్రమే అమ్మేదనే సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేశారు. దర్యాప్తు బృందం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బెలూన్లు విక్రయించే వారి కోసం ఆరా తీసింది. చివరకు ఆమె నిజామాబాద్‌లో భర్తతో పాటు బెలూన్లు విక్రయిస్తూ కనిపించింది. భర్త, ఇద్దరు పిల్లలతో ఆమె నాలుగేళ్లుగా నిజామాబాద్‌లోనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ టూ బెంగళూరు : హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టకు చెందిన 10 ఏళ్ల బాలిక, 8 ఏళ్ల బాలుడు 2017లో ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. వీరిని డిజిటల్ గుర్తింపుల ఆధారంగా వెతికి వారిద్దరూ బెంగళూరులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని నగరానికి తీసుకొచ్చారు. వీరిని షీ సైబర్ ల్యాబ్, ఏహెచ్‌టీయూ బృందం ఓపెన్ సోర్స్ టూల్స్‌ను ఉపయోగించి కనిపెట్టాయి.
తెలంగాణ ఆడపడుచులను ఆటపట్టించడం అంత ఈజీ కాదు!
Women Safety Tips Telugu : అమ్మాయిలపై 'ప్రేమ' దాడులు.. అమ్మానాన్న ఎలా కాపాడుకోవాలంటే..?