Police Booked Case on Tenali MLA Annabathuni Siva Kumar: గుంటూరు జిల్లా తెనాలి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ కేంద్రంలో ఓటరుపై దాడి చేసిన శివకుమార్‌తోపాటు మరో ఏడుగురిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదుతో ఐపీసీ సెక్షన్లు 341, 323 కింద తెనాలి రెండో పట్టణ పోలీసులు కేసు కట్టారు.
సోమవారం పోలింగ్ సందర్భంగా కుటుంబసభ్యులు, అనుచరులతో కలిసి ఎమ్మెల్యే శివకుమార్‌ను ఐతానగర్ కేంద్రానికి వచ్చారు. తామంతా గంటలకొద్దీ క్యూలో వేచిచూస్తుంటే, మందీమార్భలంతో నేరుగా ఎలా వెళ్తారని ఓటు కోసం వరుసలో ఉన్న గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి ప్రశ్నించారు. దీంతో సుధాకర్ చెంపపై శివకుమార్ కొట్టారు. అంతే వేగంగా ప్రతిస్పందించిన బాధితుడు సుధాకర్ సైతం ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించారు. ఈ ఘటనతో చెలరేగిపోయిన ఎమ్మెల్యే అనుచరులు సుధాకర్‌పై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన సుధాకర్ ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు.
ఓటరును కొట్టిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యేను తిరిగి కొట్టిన ఓటర్ - MLA Beat Voter
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదు: సోమవారం ఎన్నికల పోలింగ జరుగుతున్న సమయంలో డోన్ స్వతంత్ర అభ్యర్థి పీఎన్ బాబు కారుపై బుగ్గన అనుచరుల దాడి చేసిన ఘటనలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదైంది. నంద్యాల జిల్లా బేతంచెర్ల పీఎస్‌లో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. బుగ్గన తనను కులం పేరుతో దూషించి దాడి చేశారని పీఎస్ బాబు ఫిర్యాదు చేశారు. బుగ్గన సహా అనుచరులపై కూడా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయింది.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై కేసు: అదే విధంగా వైఎస్సార్ జిల్లా మైదుకూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై కూడా కేసు నమోదైంది. ఎమ్మెల్యేతో పాటు మరో 11 మంది అనుచరులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదుచేశారు. పోలింగ్ సందర్భంగా ఇద్దరు టీడీపీ ఏజెంట్లపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు. చాపాడు మండలం చిన్నగులవలూరులో సోమవారం తెదేపా ఏజెంట్లపై దాడి చేయగా, వారు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.
వైఎస్సార్సీపీకి షాక్ - తిరగబడ్డ ఓటర్లు - తోకముడిచిన లీడర్లు - AP ELECTIONS 2024 POLLING