Police Arrest Bike Racers in Hyderabad : నగరంలో రాత్రి వేళల్లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. ద్విచక వాహనాలతో సిటీ అంతా చక్కర్లు కొట్టడంతో పాటు విన్యాసాలు చేస్తున్నారు. ఒకప్పుడు కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, ఎన్‌టీఆర్ మార్గ్, ఉప్పల్ రింగ్ రోడ్ సమీపాల్లో గుంపులు గుంపులుగా బైకులపై సంచరిస్తూ విన్యాసాలు చేసేవారు. పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి వారు వెళ్లే మార్గాల్లో రెక్కీ నిర్వహించి అడ్డుకునేవారు. ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పెట్టి కేసులు నమోదు చేసేవారు.
అయితే పోలీసుల తనిఖీలు ఎక్కువ అవడంతో, వీరంతా రాయదుర్గం వైపుకు వెళ్లుతున్నారు. మైహోం భూజా, టీహబ్ నుంచి రాయదుర్గం వైపు వెళ్లేందుకు కొండను తొలిచి నిర్మించిన లింకు రోడ్డు ఇందుకు అనుకూలంగా మారింది. అక్కడ ఎక్కువగా వాహన రాకపోకలు ఉండకపోవడమే ఇందుకు కారణం. ఐటీ కారిడార్ అయిన రాయదుర్గం ప్రాంతంలో ఉన్న ఈ లింకు రోడ్డులో రాత్రి 9 తర్వాత ఎక్కువగా వాహనాల రద్దీ ఉండదు. దీంతో పాటు సుందరీకరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు.
టీహబ్, మైహోమ్ భూజా ఎత్తైన భవనాలు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ కోసం ఇంత కంటే మంచి లొకేషన్ దొరకదని యువకులు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. మరీ ముఖ్యంగా ఇదే ప్రాంతంలో ఓ పెట్రోల్ బంకు కూడా ఉండటంతో అక్కడ పెట్రోల్ నింపుకుని బైకులు కార్లపై యువకులు విన్యాసాలు చేస్తున్నారు. శని, ఆదివారాల్లో ఈ తరహా పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖరీదైన కార్లు, ద్విచక్రవాహనాలపై రేసింగ్‌లు నిర్వహిస్తున్నారు. లైకుల కోసం ఈ వీడియోల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు.
రేసింగ్‌లు, బైకు స్టంట్లు తరచూ జరుగుతున్నా వీటికి సంబంధించిన వీడియోలు తరచూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాకే పోలీసులు హడావుడిగా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ నిందితుల్ని పట్టుకున్నా పెట్టీ కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. స్టంట్‌లు చేస్తూ చాలా మంది కింద పడి గాయాలపాలవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ స్టంట్ వీడియోలు చూసి వారి ఫోలో అయ్యే వారు లైవ్‌లో చూసేందుకు కూడా వస్తున్నారు.
గతంలో ఇదే అంశాన్ని మాధాపూర్ డీసీపీ వినీత్ దృష్టికి వెళ్లగా వెంటనే ప్రత్యేక పోలీసు బృందాల్ని రంగంలోకి దింపారు. శనివారం రాత్రి మొత్తం 51 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. వారి ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ప్రత్యేక డ్రైవ్ లో ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు, వారిపై ఐపీసీ సెక్షన్ 336, 341, 184 మోటారు వాహన చట్టం కింద కేసులు నమోదు చేశారు. తల్లి దండ్రులు సమక్షంలో వారికి కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరిస్తామని పోలీసులు తెలిపారు.