Police Arrested Poker Players in Rajanna Siricilla : తీవ్ర వాదులను పట్టుకునేందుకు పోలీసులు మారువేషాల్లో వెళ్లడం సినిమాల్లో చూస్తుంటాం. కానీ ప్రజల జీవితాల్లో చిచ్చురేపుతున్న పేకాటను అడ్డుకునేందుకు పోలీసులు వేషం మార్చి జూదరులను పట్టుకున్న ఘటన తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. జూదరులు సాధారణంగా తమ ఆటకు ఇబ్బందుల్లేని, పోలీసులు రాని, కుటుంబ సభ్యులకు అనుమానం కలగని రహస్య ప్రదేశాలను ఎంచుకుంటుంటారు.
ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామ శివారు ప్రాంతంలో పంట పొలాల మధ్య పేకాటాడుతున్నారనే సమాచారం పోలీసులకు అందింది. పొలాల్లోకి నేరుగా పోలీస్ వాహనం వెళ్లే పరిస్థితి లేకపోవడం, పొలం గట్లపై నుంచి యూనిఫామ్‌లో వెళ్తే తమను చూసి పేకాట రాయుళ్లు పారిపోతారని భావించి దిమ్మతిరిగే ప్లాన్ వేశారు.
ఈ మేరకు పేకాట ఆడుతున్న స్థావరానికి పోలీసులు నాలుగు వైపులలో రైతులుగా, కూలీలుగా అవతారం ఎత్తి లుంగీలు, తలపాగ కట్టుకొని పేకాట శిబిరాల వద్దకు సీఐ మొగిలి బృందం వెళ్లింది. రైతు కూలీలుగా భావించిన పేకాట రాయుళ్లు సైతం దర్జాగా పేకాట ఆడుతూ, చివరకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. ఈ ఆకస్మిక దాడిలో మొత్తం ఏడుగురుని అరెస్ట్ చేసి, వారి దగ్గర నుంచి రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
నగరంలో రెచ్చిపోతున్న దారి దోపిడీ దొంగలు - ఏకంగా 13 మంది అరెస్టు - Robbers Arrested in Secunderabad