Fake Tea Powder Gang Arrest In Hyderabad : మనలో చాలా మందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. ఇక టీ ప్రేమికులైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక కప్పు వేడి ఛాయ్ లేని రోజును వారు అస్సలు ఊహించుకోలేరు! ఇక కొందరికైతే టీ తాగకపోతే ఆ రోజు ఏదీ తోచదు. అందుకే చాలా మంది టీని ఒక మంచి రిఫ్రెష్నర్ డ్రింక్‌గా భావిస్తారు. అయితే ప్రయాణాలు చేసి అలసిపోయినప్పుడు కాస్త ఉపశమనం పొందేందుకు దారెంట టీ బంక్ వద్ద ఆగారా! ఒక్క క్షణం అక్కడ వాడుతున్న టీ పొడిని చూశాకే రుచి చూడండి.
కల్తీ టీ పొడి సరఫరా గ్యాంగ్ అరెస్ట్ : హైదరాబాద్‌లో టీ దుకాణాలకు తక్కువ ధరకు కల్తీ టీ పొడి సరఫరా చేస్తున్న ముఠాను ఆటకట్టించారు మధ్యమండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు. కల్తీ టీ పొడి తయారు చేసి దుకాణాలకు విక్రయిస్తున్న ముగ్గురు కల్తీరాయుళ్లను అరెస్ట్ చేసినట్టు టాస్క్‌ఫోర్స్ డీసీపీ వై.వి.ఎస్.సుధీంద్ర బుధవారం తెలిపారు. బాలానగర్‌లోని ఫతేనగర్‌కు చెందిన బి.జగన్నాథ్(32) స్థానికంగా ‘కోణార్క్ టీ పౌడర్ సేల్స్, సప్లయిర్స్’ పేరిట వ్యాపారం చేస్తున్నాడు. నాసిరకం టీ పొడి కిలో రూ.80-100కు కొనుగోలు చేసేవాడు. ఆ పొడిలో కొబ్బరి పీచు పొడి, పంచదార పాకం, రసాయనాలు కలిపి కొత్తరకం టీ పొడికి రూపమిస్తున్నాడు. దాన్ని కిలో రూ.200-250 చొప్పున విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు.
నాణ్యతను పరిశీలించుకోవాలి : ఒడిశాకు చెందిన ప్రతాప్ ప్రదాన్ (21), శివాశ్విన్ ఫరిదా (19) ఇతడి వద్ద పనిచేస్తున్నారు. వీరిద్దరూ దుకాణాల వద్దకు సరుకు చేరవేసేవారు. తక్కువ ధరకు టీ పొడి వస్తుందనే ఉద్దేశంతో టీ బండి నిర్వాహకులు, చిల్లర దుకాణదారులు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ను అనుసరించి రోజూ 200 కిలోల వరకూ తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి చర్యల కోసం నిందితులను ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు. ప్రధాన నిందితుడిపై గతంలో మూడు కేసులు ఉన్నట్లు డీసీపీ తెలిపారు. కల్తీ టీ పొడి వాడకంతో కామెర్లు, టైఫాయిడ్, ఎలర్జీలు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కొనుగోలు చేసే ముందు నాణ్యతను పరిశీలించుకోవాలని సూచించారు.
ఇంట్రస్టింగ్ : చాయ్ తాగితే బరువు పెరుగుతారా? - నిపుణులు ఏం చెబుతున్నారు!