BRS Leader Balka Suman Arrested : పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక వేళ హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ఉద్రిక్తత నెలకొంది. పలువురు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పోచారం నివాసానికి వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఉదయం పోచారం నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మరికొందరు కాంగ్రెస్ నేతలు వెళ్లగా, విషయాన్ని తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్‌తో పాటు మరికొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు పోచారం నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్ణణ వాతావరణం చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు, బాల్క సుమన్ గెల్లు శ్రీనివాస్ సహా పదిమందికి బెయిలు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి రాక సమయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనటం పట్ల పోలీసులు తీవ్రంగా పరిగణించారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఎలా అక్కడికి చేరుకున్నారని ఆరా తీశారు. మరోవైపు మాజీ శాసనసభాపతి నివాసం వద్ద జరిగిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.
సీఎం ఉన్నప్పుడే పోచారం ఇంటి వద్దకు బీఆర్ఎస్ నేతలు చొచ్చుకురావడం కలకలం రేపింది. బీఆర్ఎస్ కార్యకర్తలు పోచారం ఇంట్లోకి చొచ్చుకు వస్తుంటే అక్కడున్న పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈఘటనకు కారకులైన బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పోలీసు అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పశ్చిమ మండలం డీసీపీ విజయ్ కుమార్, సీఎం ముఖ్య భద్రతాధికారి గుమ్మి చక్రవర్తి అక్కడకు చేరుకొని విచారణ చేపట్టారు. విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వీడియోలను పరిశీలించి ఏం జరిగిందన్న దానిపై ఆరా తీశారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.