Police on Cambodia Jobs Scam : ఉద్యోగ వేటలో ఉన్న యువకులే లక్ష్యంగా చేసుకుని, మాయమాటలతో కొందరు దళారులు యువతను నమ్మించి విదేశాలకు చేరవేస్తున్నారు. సింగపూర్, దుబాయ్, బ్యాంకాక్ వంటి దేశాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి ఉద్యోగాల్లో చేరి ఏడాదిలో ఆర్ధిక ఇబ్బందులు దూరం చేసుకోవచ్చని ఆశ చూపిస్తున్నారు. ఇదంతా నిజమని భావించిన యువకులు, అడిగినంత డబ్బులిస్తున్నారు. ఉచ్చులో చిక్కుకున్న యువతను దళారులు దుబాయ్ మీదుగా కంబోడియాకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఆపై చైనా మాయగాళ్ల చేతికి అప్పగిస్తున్నారు. వీరి పాస్‌పోర్టు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఆ ముఠాలు, తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలకు పావులుగా వాడుకుంటున్నట్టు ఇటీవల పోలీసుల దర్యాప్తులో తేలింది.
కంబోడియా కేంద్రంగా అసాంఘిక కార్యకలాపాలు : ఫెడెక్స్ కొరియర్‌లో మాదక ద్రవ్యాలు, సిమ్ కార్డులతో అసాంఘిక కార్యకలాపాలు, ఇన్వెస్ట్‌మెంట్ మోసాలకు పాల్పడటంలో వీరిని ఉపయోగించుకుంటున్నారు. నగరంలో ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులకు అందుతున్న ఫిర్యాదుల్లో అధిక శాతం ఇవే ఉండటంతో వీటి మీద దృష్టి సారించారు. కంబోడియా కేంద్రంగా ఇవన్నీ సాగుతున్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకూ చైనా కేటుగాళ్లు ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రధాన నగరాల్లోని భారతీయులకు కమీషన్ ఆశ చూపి ఇక్కడే నకిలీ సంస్థలను ప్రారంభించి సైబర్ నేరాలకు పాల్పడ్డారు. పోలీస్ కేసులు, బ్యాంకు లావాదేవీలు స్తంభింపజేయటంతో కేటుగాళ్లు తమ పంథా మార్చారు.
దేశం నుంచి యువతను అక్రమంగా విదేశాలకు రప్పించి, వారిని టెలీ కాలర్స్‌గా తయారు చేస్తున్నారు. ప్రతి ఏడాది తెలంగాణ రాష్ట్రం నుంచి ఉపాధి, ఉద్యోగం, ఉన్నత విద్యావకాశాలకు లక్షలాది మంది విదేశాలకు వెళ్తున్నారు. వీరిలో ఆఫ్రికా దేశాలకు వెళ్తున్న వారిని అక్కడి డ్రగ్స్ ముఠాలు కమీషన్ ఆశ చూపి ఏజెంట్లుగా మలచుకుంటున్నాయి. గతేడాది డ్రగ్స్ కేసులో బెంగళూరు పోలీసులు ఒక మహిళను అరెస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన ఒక ముఠా ఉద్యోగం ఇప్పిస్తామని అక్కడకు రప్పించి, మత్తు పదార్థాలు చేరవేసే ఏజెంట్‌గా మార్చినట్టు పోలీసుల విచారణలో బయటపడింది.
సైబర్ నేరాల్లో తెలుగు యువత : తాజాగా కంబోడియాలో చైనీయులు తెలుగు యువతను సైబర్ నేరాలకు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం దుబాయ్, కంబోడియా, సింగపూర్, శ్రీలంక తదితర దేశాలకు వెళ్లిన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా యువకులు ఏయే దేశాలకు వెళ్లారు? వారిలో ఎంతమంది కుటుంబసభ్యులకు అందుబాటులో ఉంటున్నారనే వివరాలు సేకరిస్తారు. అక్కడ లభించిన సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.