Realtors Plan 500 Crore Govt Land Occupied at Hyderabad : హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ మణికొండ సమీపంలో రూ.500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కొందరు వ్యక్తులు యత్నించారు. దీనిని ఆక్రమించుకునేందుకు ఇద్దరు రియల్టర్లు సహా 10 మంది కలిసి మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ విషయమై గండిపేట తహసీల్దార్ ఎన్.శ్రీనివాస్ రెడ్డి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, రెవెన్యూ అధికారుల సహాయంతో వారి గుట్టును రట్టు చేశారు.
Police and Revenue Officers Rescue Pokalwada Govt Land : మణికొండ సమీపంలోని పోకల్‌వాడలో హెచ్‌ఎండీఏ, ప్రైవేట్ భూముల మధ్య ఉన్న రూ.500 కోట్ల విలువైన ఐదెకరాల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని కాజేయడానికి రియల్టర్లు రాఘవేందర్ రెడ్డి, రవీందర్ యాదవ్ 3 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నారు. స్థానికంగా ఉండే పూస ప్రహ్లాద్, పూస రవీందర్‌లను కలిసి ‘మీ పేరు మీద నకిలీ పత్రాలు సృష్టిస్తాం, భూములు చేజిక్కిన తర్వాత రూ.కోట్లలో డబ్బులిస్తామంటూ' వారిని ఒప్పించారు.
రూ.10 కోట్ల ఆఫర్ - రూ.కోటి అడ్వాన్స్ : అనంతరం రియల్టర్లు రాఘవేందర్‌రెడ్డి, రవీందర్ యాదవ్ నల్లగండ్లలోని అపర్ణ సరోవర్‌లో ఉంటున్న స్థిరాస్తి వ్యాపారులు మోహన్ బాబు, శివరామ్ కుమార్‌లను సంప్రదించి ఈ వ్యవహారంలో భాగస్వాములుగా చేసుకున్నారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ధరణి పోర్టల్‌లో పని చేస్తున్న దీపావత్ నరేశ్, దీపావత్ శ్రీనివాస్‌లను కలిశారు. నకిలీ పత్రాల ఆధారంగా ఈ - పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని వారిని ఒప్పించారు. ఇందుకు రూ.10 కోట్లు ఇస్తామని, అడ్వాన్సుగా రూ.కోటి ఇస్తామని నరేశ్, శ్రీనివాస్‌లకు ఆశచూపారు.
కలెక్టర్లను ఏమార్చి : తొలుత గత సంవత్సరం జులైలో దీపావత్ శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు ఇచ్చారు. ఇందులో భాగంగానే మీ సేవ ద్వారా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు గతేడాది సెప్టెంబర్‌లో పూస ప్రహ్లాద్ పేరుతో ఒకటి, నవంబరులో పూస రవీందర్ పేరుతో మరో అర్జీ చేయించారు. కలెక్టర్లుగా సెప్టెంబర్‌లో హరీశ్, నవంబర్‌లో భారతి హోళికేరి ఉన్నారు. దీపావత్ నరేశ్ వీరిద్దరినీ వేర్వేరు సందర్భాల్లో ఏమార్చి, రెండు దరఖాస్తులపైనా ఆమోద ముద్రలు వేయించారు. ఇలా ప్రహ్లాద్ పేరుతో 2.20 ఎకరాలు, రవీందర్ పేరుతో 2.20 ఎకరాలను పట్టాభూమిగా ధరణి పోర్టల్‌లో మార్చారు.
దీనిపై అనుమానం వచ్చిన గండిపేట తహసీల్దార్ ఎన్.శ్రీనివాస్ రెడ్డి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ గుట్టును ఛేదించారు. భూముల అక్రమ మార్పిడికి సంబంధించిన ఫైళ్లపై అప్పటి కలెక్టర్లు ఎస్.హరీశ్, భారతి హోళికేరిలను వేర్వేరు తేదీల్లో దీపావత్ శ్రీనివాస్, దీపావత్ నరేశ్‌లు మభ్యపెట్టి ఆమోద ముద్రలు వేయించారని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో రంగారెడ్డి జిల్లా ధరణి పోర్టల్‌లో పని చేస్తున్న దీపావత్ శ్రీనివాస్‌తో పాటు సోంపల్లి మోహన్ బాబు, కుక్కుల శివరామ్ కుమార్, డి.ఆంజనేయులును అరెస్ట్ చేశారు. మరో ధరణి ఆపరేటర్ దీపావత్ నరేశ్ నాయక్ పరారీలో ఉన్నాడని, అతడితో పాటు మరో ఐదుగురి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
రూ. కోట్ల విలువైన స్థలం అన్యాక్రాంతం.. పట్టించుకోని బల్దియా యంత్రాంగం