PM Modi Released Books on Venkaiah Naidu: వెంకయ్యనాయుడు 75వ జన్మదినం సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానంపై మూడు పుస్తకాలను ప్రధాని మోదీ వర్చువల్‌గా విడుదల చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఆన్వయ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. 'సేవలో వెంకయ్యనాయుడు జీవితం', '13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు లక్ష్యం, సందేశం' 'మహానేత వెంకయ్యనాయుడు జీవితం, ప్రయాణం' అనే పుస్తకాలను మోదీ విడుదల చేశారు.
వెంకయ్య జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని మోదీ అన్నారు. ఈ పుస్తకాలు దేశ ప్రజల సేవకు మార్గనిర్దేశనం చేస్తాయని, వెంకయ్యనాయుడుతో సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం తనకు దక్కిందన్నారు. గ్రామస్థాయి నుంచి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగారని కొనియాడారు. వేలాది కార్యకర్తలు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నారన్న మోదీ, అత్యయిక పరిస్థితి వేళ వెంకయ్యనాయుడు పోరాడారని గుర్తు చేసుకున్నారు.
అత్యయిక పరిస్థితి సమయంలో 17 నెలలు జైలు జీవితం గడిపారన్న మోదీ, గ్రామీణ, పట్టణాభివృద్ధిశాఖలో తనదైన ముద్రవేశారని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్, అమృత్ యోజన వంటి ఎన్నో పథకాలు సమర్థంగా అమలు చేశారని, వెంకయ్యనాయుడు చాతుర్యం, వాగ్దాటి ముందు ఎవరూ నిలవలేరన్నారు. రాజ్యసభ ఛైర్మన్‌గా సభను సజావుగా నడిపారని అన్నారు. రాజ్యసభ ఛైర్మన్‌గా ఆయన సేవలను దేశం మరవదన్న మోదీ, ఆర్టికల్ 370 రద్దు బిల్లు తొలుత రాజ్యసభ ముందుకు వచ్చిందని, ఆ బిల్లు ఆమోదంలో వెంకయ్య పాత్ర కీలకమని పేర్కొన్నారు. రాజ్యసభ నిర్వహణలో వెంకయ్య అనుభవం ఉపయోగపడిందని, దీర్ఘకాలం ఆయన ఆరోగ్యంగా ఉండి మార్గనిర్దేశం చేయాలన్నారు. కాగా జులై 1న వెంకయ్యనాయుడు జన్మదినం.
వెంకయ్య నాయుడుపై మూడు పుస్తకాలు- ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరణ
ప్రధాని సేవలు కొనసాగించాలి: దేశ ప్రజలకు ప్రధాని అందిస్తున్న సేవలు కొనసాగించాలని వెంకయ్యనాయుడు అన్నారు. రిఫార్మ్, పర్‌ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ నినాదంతో ముందుకెళ్తున్నారన్న వెంకయ్య, అవసరం ఉన్నంత వరకు ఉచిత రేషన్ పథకం కొనసాగించాలని సూచించారు. యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను కొనసాగించాలని, మాతృభాషలను కేంద్రం ప్రోత్సహించడం గొప్ప విషయమని ప్రశంసించారు.
ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదు: తాను ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదన్న వెంకయ్యనాయుడు, ప్రభుత్వ ఆదేశాలన్నీ భారతీయ భాషల్లో ఉండాలని, భారతీయ భాషల తర్వాతే ప్రభుత్వ ఆదేశాలు ఆంగ్ల భాషలో ఉండాలని అన్నారు. మదర్‌టంగ్, బ్రదర్ టంగ్ తర్వాతే ఇతర భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
సిద్ధాంతపరమైన రాజకీయాలను ప్రోత్సహించాలి: ఉత్సాహం ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రావాలని, సిద్ధాంతపరమైన రాజకీయాలను ప్రోత్సహించాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. చట్టసభలకు ఎంపికైనవారు హుందాగా ప్రవర్తించాలన్న వెంకయ్య, విలువలు పాటిస్తూ మాతృభాషను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. విలువలను కాపాడాల్సిన బాధ్యత నాయకులపై ఉందని, ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
గుణం చూసి ఓటు వేయాలి: సిద్ధాంతం నచ్చకపోతే నాయకులు పార్టీ మారవచ్చని, పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదిలి వెళ్లాలని సూచించారు. కార్యకర్తలకు నేతలు ప్రవర్తనా నియమావళి రూపొందించాలన్న వెంకయ్య, రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావాలని అన్నారు. రాజకీయాల్లో కులం, ధనం ప్రభావం తగ్గాలని, గుణం చూసి నాయకులకు ఓటు వేయాలని సూచించారు. మార్పు రాకపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందన్న వెంకయ్య, దేశ ప్రతిష్ఠను నిలబెట్టాలంటే చెడుపోకడలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.