Pinnelli Victim Manikyala Rao Meet with Chandra Babu Naidu : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నోముల మాణిక్యాలరావు హైదరాబాద్‌లో తెలుగుదేశం అధినేత చంద్రబాబును కలిశారు. పిన్నెల్లి సోదరుల అరాచకాన్ని బయటపెట్టాక తనకు ప్రాణహాని ఉందని మాణిక్యాలరావు ఆందోళన వ్యక్తం చేశారు. పిన్నెల్లి సోదరుల అరాచకాలపై మీడియాతో మాట్లాడటం, పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినప్పటి నుండి మరింత కక్షగట్టారని వివరించారు. ఎమ్మెల్యే, అతని సోదరుడు తనను, తన కుటుంబాన్ని అంతమొందించేందుకు ప్రైవేటు సైన్యాన్ని ఉసిగొల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణభయంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో తలదాచుకున్నానని, సాక్షాత్తు డీజీపీకి కూడా మొర పెట్టుకున్నానని చంద్రబాబుకు వివరించారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. అలాగే మాణిక్యాలరావు పోరాటాన్ని అభినందించారు.
టీడీపీ ఏజెంట్‌గా కూర్చునే ధైర్యం ఎవరిచ్చారు? : కాగా పోలింగ్ రోజు మాణిక్యరావు, అతడి కుటుంబసభ్యులపై దాడి జరిగింది. ఎన్నికల సమయంలో టీడీపీ పోలింగ్ ఏజెంట్‌గా మాణిక్యరావు కూర్చున్న సమయంలో పిన్నెల్లి అనుచరులు దాడి చేశారు. మరోవైపు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిపై మాణిక్యరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి తనను దుర్భాషలాడారని మాణిక్యరావు ఆరోపించారు. పోలింగ్ కేంద్రంలోనే పిన్నెల్లి అనుచరులు తనపై దాడి చేశారని తెలిపారు. టీడీపీ ఏజెంట్‌గా కూర్చునే ధైర్యం ఎవరిచ్చారంటూ దాడి చేశారని, అలాగే తన కుటుంబం పైనా దాడి చేసినట్లు మాణిక్యరావు పేర్కొన్నారు. పిన్నెల్లి అనుచరులు తన పెద్దకుమారుడి పొట్టపై తన్నారని, ప్రాణాలకు తెగించి టీడీపీ తరఫున పోలింగ్ ఏజెంట్‌గా కూర్చున్నానని తెలిపారు.
మాణిక్యరావును కాపాడేదెవరు?- డీజీపీ ఆదేశాలతో ఎట్టకేలకు జీరో ఎఫ్ఐఆర్ - Manikya Rao Complaint
పిన్నెల్లి సోదరుల కంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు బెటర్ : వెంకట్రామిరెడ్డి కాళ్లు పట్టుకుని తమ వదిన బ్రతిమాలినా వదల్లేదని మాణిక్యరావు ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబంపై ఆయనకు అంత కక్ష ఎందుకని ప్రశ్నించారు. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి భయపడి అధికారులు నోరు మెదపలేదని, తనపై దాడి చేస్తున్నా పోలీసులు స్పందించలేదని తెలిపారు. డీఎస్పీ ఉండగానే తనపై దాడికి యత్నించారని వాపోయారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని డీఎస్పీని సైతం బెదిరించారని మండిపడ్డారు. పిన్నెల్లి సోదరుల కంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చాలా బెటర్ అని విమర్శించారు. తనను చంపేంత తప్పు ఏం చేశానని, వైఎస్సార్సీపీ చేస్తున్న రిగ్గింగ్‌ను అడ్డుకోవడమే తాను చేసిన తప్పా అని మాణిక్యరావు ఆవేదన వ్యక్తం చేశారు.
డీజీపీ ఆదేశాల మేరకు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు : పిన్నెల్లి బాధితుల విషయంలో మంగళగిరి పోలీసులు ఉదాసీనత ప్రదర్శించారు. వెంకట్రామిరెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మాణిక్యరావు జీరో ఎఫ్‌ఐఆర్ తీసుకునేందుకు పోలీసుల నిరాకరించారు. పిన్నెల్లి బాధితులు మంగళగిరి పీఎస్‌లో దాదాపు మూడు గంటల పాటు ఎదురుచూశారు. తమపై ఒత్తిడి ఉందని, ఫిర్యాదును పల్నాడు జిల్లాలో ఇవ్వాలంటూ ఎస్ఐ క్రాంతి కిరణ్ టీడీపీ నేతలకు చెప్పారు. అక్కడకు వెళ్లే పరిస్థితి లేకే మంగళగిరి పీఎస్‌కు వచ్చానని మాణిక్యరావు తెలిపారు. ఎస్సై వ్యవహరించిన తీరుపై రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేస్తామని న్యాయవాది లక్ష్మణరావు చెప్పారు. దీంతో డీజీపీ ఆదేశాల మేరకు జీరో ఎఫ్‌ఐఆర్‌ను పోలీసులు నమోదు చేశారు.