People Suffering Due to Rains in Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. గ్రామాలు, మండల కేంద్రాలకు మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పరిధిలోని వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామం జలదిగ్బంధమైంది. ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగు నీటిలో ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకుంటున్నారు.
అటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు పాడేరు మండలం రాయిగెడ్డ, పరదానిపుట్టు వంతెనల పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. డుంబ్రిగుడ మండలం కితలంగి వెళ్లే వంతెన వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. జి.మాడుగుల మండలం కుంబిడిసింగి, తూలం వెళ్లే వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పెదబయలు మండలం గిన్నెలకోట, జామిగూడ పంచాయతీ పరిధిలోని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
ఆగిన రాకపోకలు: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. మల్కాన్‌గిరి జిల్లా నుంచి ఆంధ్ర-తెలంగాణను కలిపే జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండంతో రాకపోకలు నిలిచిపోయాయి. మల్కాన్‌గిరి నుంచి మోటూ మార్గంలోని పొడియా, పోటేరు మధ్య రహదారిపై నుంచి 7 అడుగుల మేర వరద ప్రవహిస్తుండటంతో భద్రాచలం వెళ్లే మార్గాల్లో రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
రోడ్డుపై నిలిచిన నీరు - బైఠాయించిన ఎమ్మెల్యే
నేలకొరిగిన భారీ వృక్షం: పాడేరు ఘాట్ రోడ్ మార్గంలో డైమండ్ పార్క్ వద్ద ఓ భారీ వృక్షం నేలకొరిగింది. ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. బస్సులు, లారీలు, కార్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కొందరు ద్విచక్ర వాహనదారులు అతి కష్టం మీద ప్రయాణిస్తున్నారు. మరోవైపు పాడేరు మండలం పరదానిపుట్టు వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతెన పైనుంచి వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి.
గోదావరిలో మునిగిన పోశమ్మ ఆలయం: గోదావరిలో మునిగిదేవీపట్నం మండలంలోని గండి పోశమ్మ ఆలయం గోదావరిలో మునిగి పోయింది. అమ్మవారి విగ్రహం పూర్తిగా మునిగింది. ప్రస్తుతం గోపురం వరకు వరద చేరింది. గోదావరిలోకి భారీగా వస్తున్న వరద కారణంగా నీటి మట్టం మరింత పెరగనుంది. ఆలయ గోపురం కూడా మునిగిపోతుందని స్థానికులు చెబుతున్నారు.
కోతకు గురైన రహదారి: అరకు నుంచి పాడేరు వైపు నిర్మిస్తున్న 516 జాతీయ రహదారి కోతకి గురైంది. డుంబ్రిగూడ మండలం బిల్లాపుట్టు సమీపంలోని కల్వర్టు కృంగిపోవడంతో జాతీయ రహదారి కోతకి గురైంది భారీ వాహనాలు ఈ మార్గంలో వెళ్లడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రహదారి నిర్మాణంలోనూ నాణ్యత పాటించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.
షడ్డుకూలి యులతికి తీవ్ర గాయాలు: జి.మాడుగుల మండలం గొడుగుమామిడిలో యువతి పై షడ్డుకూలి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ యువతిని వెంటనే పాడేరు ఆస్పత్రికి తరలించారు. హుకుంపేట మండలం శోభకోటలో ఎంపీపీ పాఠశాలపై భారీ వృక్షం పడింది. రెండు రోజులు పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. బొంగరం, హుకుంపేట, చీడిమెట్ట వంతెన పైనుంచి వరద పొంగిపొర్లుతోంది.
నేడు సింహాచలంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం - ఏర్పాట్లు చేసిన యంత్రాంగం - Simhachala Giri Pradakshina