People Suffer Due to Damaged Bridge in NTR District : ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం ముత్యాలంపాడు వద్ద బుడమేరుపై ఉన్న వంతెన రెండేళ్ల కిందట కుంగిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది. పూర్తిస్థాయి వంతెన నిర్మాణానికి సమయం ఎక్కువ పడుతుందన్న ప్రజాప్రతినిధులు, అధికారులు తాత్కాలిక వంతెన నిర్మాణానికి రూ. 55 లక్షల నిధులు మంజూరు చేసి పనులు చేయించారు. గతేడాది బుడమేరు ఉద్ధృతికి ఈ వంతెన రెండుసార్లు కోతకు గురైంది. రూ. 16 లక్షల రూపాయలతో మరమ్మతులు చేశారు. శాశ్వత హైలెవల్ పెద్ద వంతెన నిర్మాణానికి రూ. 8 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినా నిధులు మంజూరు కాలేదు.
కొత్త వంతెన నిర్మాణం దస్త్రాలకే పరిమితం : వంతెన మీదుగా నిత్యం మండల కేంద్రానికి చేరుకునేందుకు వెలగలేరు, వెల్లటూరు, కోడూరు, కందులపాడు, చిననందిగామ ప్రజలు, పొలాల్లోకి వెళ్లే రైతులు, విద్యార్థులు రాకపోకలు సాగిస్తారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి ట్రాఫిక్ మళ్లించినప్పుడు ఈ వంతెన మీదుగా విజయవాడ వైపు రాకపోకలు సాగుతాయి. మచిలీపట్నం, గుడివాడ పరిసర ప్రాంతాలకు గడ్డమణుగు లోయ ప్రాంతం నుంచి భారీ వాహనాలతో కంకర తరలిస్తుంటారు. గతంలో ఈ వంతెన కుంగినప్పుడు, తాత్కాలిక వంతెన కోతకు గురైనప్పుడు వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. అప్పుడు గ్రామాలతో మండల కేంద్రానికి సంబంధాలు తెగిపోయాయి. ఇటీవల తాత్కాలిక వంతెనపై లారీ కూరుకుపోయి రోజంతా వాహనాల రాకపోకలు నిలిచాయి.
రెండేళ్ల కిందట వచ్చిన వరదలకు వంతెన కొట్టుకుపోయింది. దాని స్థానంలో కొత్త వంతెన నిర్మించారు. కానీ గత ఏడాది కురిసిన వర్షాలకు అది కూడా పాడైపోయింది. ఈ వంతెనపై రాకపోకలు సాగించడానికి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ వంతెనపై భారీ వాహనాలు ప్రయాణించడం వల్ల తరచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వమైన ఇక్కడ శాశ్వత వంతెన నిర్మించాలని కోరుకుంటున్నాం - వాహనదారులు
అమరావతిలో మరో రెండు రాచబాటలు - సీఆర్డీఏ తాజా ప్రతిపాదన - Amaravathi National Highways
హైలెవల్ వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు : ప్రస్తుత రేట్ల ప్రకారం రూ. 10 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నత అధికారులకు నివేదించారు. నిధులు మంజూరు కాగానే శాశ్వత హైలెవల్ వంతెన నిర్మాణ పనులు చేపడతామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తాత్కాలిక వంతెనపై భారీ వాహనాలు ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తున్నాయి. ఇక్కడ రెండు వంతెనలున్నప్పటికీ నిరుపయోగంగా మారినందున తక్షణమే కూటమి ప్రభుత్వం బుడమేరు వాగుపై హైలెవెల్ వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.