Clay Pots Importance : ముప్పై ఏళ్ల క్రితం ప్రతి ఒక్కరూ మట్టి పాత్రలనే ఉపయోగించే వారు. గ్రామీణ జీవితంలో ఇవి భాగం అయ్యేవి. కానీ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందాక ప్రజలు ప్రతి పనిని సులభంగా, కష్టం లేకుండా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వచ్చినవే అల్యూమినియం పాత్రలు. వీటిలో తొందరగా వంట పూర్తవటం, సులభంగా శుభ్రపరిచే సౌకర్యం ఉన్నందున ప్రజలందరూ దీని వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ వీటి వల్ల చాలా అనారోగ్యాలు వస్తున్నాయి. దీంతో ప్రజలు మళ్లీ మట్టి పాత్రలవైపు మొగ్గు చూపుతున్నారు.
Health Benefits of Clay Pots : మట్టి వల్లే నాణ్యమైన ఆహారం మనకు అందుతుంది. ఆ పాత్రల్లో వండుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉండటానికి ఇవి దోహదం చేస్తాయని చెప్పవచ్చు. ఇది ఎంతో మంది వైద్య నిపుణులు చెబుతున్న విషయం. ఎందుకంటే మట్టి పాత్రల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. మట్టి కుండలో నీరు సహజంగా శుద్ధి అయ్యి చల్లగా తాజాగా ఉంటాయి. ఈ నీటిని తాగటం వల్ల జీవక్రియలు మెరుగుపడతాయి. ఫ్రిజ్‌లలో నీటిని చల్లబరచటం అనేది అసహజమైన పద్ధతి. ఈ నీటిని తాగటం ద్వారా గొంతు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మట్టి కుండలో నీటిని తాగటం వల్ల వడ దెబ్బ తగిలే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. దీనిలో ఎలాంటి హానికారక రసాయనాలు లేనందు వల్ల ఈ నీటిని తాగటం వల్ల జీర్ణ సమస్యలు సైతం తలెత్తవని వైద్యులు చెబుతున్నారు.
మట్టి పాత్రలకు మంచి గిరాకీ : మట్టిలో ఆల్కలైన్ స్వభావం ఉంటుంది. దాంతో ఆ పాత్రల్లో వంట చేసినప్పుడు ఆహారంలోని యాసిడ్ మట్టి పాత్రలలోని ఆల్కలైన్‌తో చర్య జరుపుతుంది. దీనివల్ల పీహెచ్ స్థాయిలు తటస్థంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ పాత్రల్లో వండిన ఆహారంలో పాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం వంటివి ఉంటాయని వారు అంటున్నారు. ఇవన్నీ తెలిసిన వారు మట్టి పాత్రలను తీసుకెళుతున్నారని వ్యాపారులు అంటున్నారు.
మట్టి పాత్రలను చాలా సహజ పద్దతిలో తయారు చేస్తామని, వాటి కోసం వాడే మట్టిలో ఎలాంటి రసాయనాలు ఉండవని వ్యాపారులు అంటున్నారు. మట్టిని పొడిచేసి నానబెట్టి, ఆరబెట్టి తర్వాత పాత్రల తయారీ జరుగుతుందని వివరిస్తున్నారు. మట్టి పాత్రలకు సూక్ష్మ రంధ్రాలు ఉండటం వల్ల వీటిలో ఆహారం వండితే సమానంగా ఉడుకుతుందన్నారు. అందులోని పోషకాలు కూడా నష్టపోకుండా ఉంటాయి. ఈ పాత్రల్లో చేసే వంటలకు ఎక్కువగా నూనె కూడా అవసరం లేదు.
మట్టి పాత్రల్లో వండితే ఆ రుచే వేరు : పైగా అదనపు రుచి కూడా వస్తుంది. తాతల కాలంలో మట్టి పాత్రల్లో వంటలు చేసే వారు కాలక్రమంలో మానేశారు. కానీ ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్యం పట్ల ఉన్న శ్రద్ధ వల్ల మళ్లీ వీటికి గిరాకీ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. మరుగున పడిపోయిన మట్టి పాత్రల వాడకం పెరగడం శుభసూచకం. అందరికీ ఆరోగ్యాన్ని చేకూర్చే మట్టి పాత్రలను మళ్లీ జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్లే.
"దాదాపు 40 ఏళ్లుగా ఈ కుమ్మరి పని చేస్తున్నాను. ప్రజలంతా మట్టి పాత్రల్లో వండుకుంటే ఆరోగ్యంగా ఉంటామని భావిస్తున్నారు. అందుకు గతంలో పెద్దలు వాడుకున్న పద్ధతినే వీళ్లు పాటించి ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నారు. అందుకే మట్టి పాత్రల్లో వండుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారు. కుండల తయారీలో ఎలాంటి రసాయనాలు వాడటం జరగదు. ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్లు గ్లాస్లు, కర్రీ బౌల్లు, వాటర్ బాటిల్స్, వాటర్ మగ్లు వంటివి తయారు చేస్తున్నాం. ఎర్రటి, నల్లటి మట్టి పాత్రలకు ఎలాంటి తేడా లేదు. రెండూ ఒకటే." - ఆంజనేయులు, కుండల తయారీదారుడు
మట్టికుండా మజాకా - వేసవిలో సమ్మర్ పాట్స్‌కు సూపర్ క్రేజ్ - Clay Pots Demand in Market