Pensions Distribution in Andhra Pradesh : రాష్ట్రంలో పెన్షన్ల పంపిణికీ సంబంధించి సెర్ప్ సీఈఓ ఆదేశాలను సవరిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రెండు కేటగిరీలుగా పెన్షన్లను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కొందరికి ఇంటి వద్ద, మిగిలిన వారికి గ్రామవార్డు సచివాలయాల వద్ద పెన్షన్లను పంపిణీ చేసేలా ఈ మార్గదర్శకాలను జారీ చేశారు. 3వ తేదీ మద్యాహ్నం నుంచి 6వ తేదీ వరకూ పెన్షన్ల పంపిణీ పూర్తి చేసేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. పెన్షన్ల పంపిణీని పర్యవేక్షించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.
మార్గదర్శకాలు విడుదల: బుధవారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. పెన్షనర్లు గ్రామవార్డు సచివాలయాలకే వచ్చి పెన్షన్లు తీసుకోవాలన్న సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి ఆదేశాలను సవరిస్తూ మార్గదర్శకాలను జారీ చేసింది. 6 తేదీకి పెన్షన్ల పంపిణీని ముగించాల్సిందిగా పంచాయితీరాజ్ శాఖ ఉత్తర్వులను విడుదల చేసింది.
రెండు కేటగిరీలుగా పెన్షన్లు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు జారీ చేయగా, ఇందులో కొందరికి ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేయటంతో పాటు మిగిలిన వారికి గ్రామవార్డు సచివాలయాల వద్ద పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. దివ్యాంగులు, శాశ్వత వైకల్యం కలిగిన వారు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు, అస్వస్థతకు గురైనవారు, మంచానపడిన వారికి, వీల్ చైర్కు మాత్రమే పరిమితమైన వారికీ ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాల్సిందిగా ప్రభుత్వం పేర్కొంది.
పింఛన్ల పంపిణీపై టీడీపీ విస్తృత పోరాటం - రంగంలోకి దిగిన చంద్రబాబు - Chandrababu Fight on Pensions
వృద్ధాప్యంలో ఉన్న మాజీ సైనికుల వితంతువులకు ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వాలని సూచనలు ఇచ్చారు. ఇతర లబ్ధిదారులకు గ్రామవార్డు సచివాలయాల్లో పెన్షన్లను పంపిణీ చేయాల్సిందిగా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. గ్రామవార్డు సచివాలయాలు పెన్షన్ పంపిణీ కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ విధులు నిర్వహించేలా చూడాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.
గ్రామ సచివాలయాలకు చాలా దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా 27 వేల మంది మాత్రమే సిబ్బంది ఉన్నట్టు ప్రభుత్వం తేల్చింది. సామాజిక పెన్షన్ల పంపిణీకి సరిపడినంత మంది ప్రభుత్వ సిబ్బంది లేకపోవటంతో రెండు కేటగిరీలుగా పెన్షన్లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. పెన్షన్ల పంపిణీని పర్యవేక్షించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు సూచనలు జారీ చేశారు. మరో వైపు ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముగించాల్సిందిగా ప్రభుత్వం పేర్కొంది.
రాజకీయ లబ్ధి కోసమే ఈసీపై వైఎస్సార్సీపీ దుష్ప్రచారం: అనగాని - Anagani on Pension Distribution