Pension Problems In Andhra Pradesh : రాష్ట్ర వ్యాప్తంగా ఏ సచివాలయం పరిధిలోనూ తొలిరోజు వైఎస్సార్ పింఛన్ల కానుక పంపిణీ సరిగా జరగలేదు. 90 శాతం సచివాలయాల్లో అసలు మధ్యాహ్నం వరకూ పింఛన్ల పంపిణీనే ప్రారంభించలేదు. పింఛన్ల పంపిణీకి ఎన్నికల సంఘం, ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను ఒక్క సచివాలయంలోనూ పాటించలేదు. కనీసం తాగునీరు కూడా ఎక్కడా అందుబాటులో ఉంచలేదు. టెంట్లు సైతం అరకొరగానే వేశారు. కనీసం వృద్ధులు, దివ్యాంగులనే జాలి కూడా చూపించలేదు. ఎండలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ పడిగాపులు కాసేలా చేశారు. బుధవారం నుంచి ఆరో తేదీ వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్లను ఇవ్వాలంటూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది.
బుధవారం సైతం ఆరంభించిన పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఆపసోపాలు తప్పలేదు. ఉదయం 7గంటల నుంచి పింఛన్ ఇస్తామని సచివాలయ సిబ్బంది చెప్పడంతో ఉదయాన్నే చేరుకున్నారు. కానీ సిబ్బంది మాత్రం 9 గంటలకు హాజరయ్యారు. సమయానికి నిధులు సమకూర్చలేని యంత్రాంగం సచివాలయాల వద్ద సరైన వసతులు ఏర్పాటు చేయలేని సిబ్బంది. పెద్ద సంఖ్యలో వచ్చిన లబ్ధిదారులపై ఇష్టారీతిన మాట్లాడిన పలువురు ఉద్యోగుల తీరు విమర్శలకు దారి తీసింది. వాలంటీర్లు రంగంలోకి దిగి పింఛనర్ల మనసుల్లో విషం నింపే కార్యక్రమానికి తెరతీశారు. పింఛన్ల పంపిణీలో జాప్యానికి, సచివాలయాల వద్దకు రావాల్సిన పరిస్థితి తలెత్తడంతో అవ్వాతాతలు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది.
ఈసీ ఆదేశాలను పట్టించుకోని ప్రభుత్వం - పింఛన్ కోసం అవ్వాతాతలు ఇబ్బందులు - Pension Problems in ap
సచివాలయాల వద్ద పడిగాపులు : పెన్షన్ల కోసం బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేయకపోవడంతో గుంటూరు జిల్లాలో రెండోరోజూ వృద్ధులు, మహిళలకు అవస్థలు తప్పడంలేదు. బుధవారం రోజు ఖాతాల్లో డబ్బుల్లేక సచివాలయ సిబ్బంది సాయంత్రం వరకూ లబ్ధిదారులకు పింఛన్ ఇవ్వలేకపోయారు. ఇవాళ ఉదయం 7గంటల నుంచి పింఛన్ ఇస్తామని సచివాలయ సిబ్బంది చెప్పడంతో లబ్ధిదారులు గుంటూరులోని సచివాలయాలకు చేరుకున్నారు. సిబ్బంది మాత్రం 9 గంటలకు వచ్చి బ్యాంకు నుంచి నగదు తీసుకురావాలని, మధ్యాహ్నం రావాలని లబ్ధిదారులకు చెబుతున్నారు. నానా ఇబ్బందులు పడి సచివాలయాలకు వస్తున్న వృద్ధులు, దివ్యాంగులు తిరిగి వెళ్లలేక అక్కడే పడిగాపులు కాస్తున్నారు. కొందరు చేసేది లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు.
సచివాలయ సిబ్బంది ప్రవర్తనతో పింఛనుదార్లు అష్టకష్టాలు : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పింఛన్ల కోసం లబ్ధిదారులు నానా అవస్థలు పడ్డారు. పింఛనుదారుల వద్దకే వెళ్లి పింఛన్లు అందించమని అధికారులు ఆదేశించినా సచివాలయ సిబ్బంది పెడచెవిన పెట్టారు. లబ్ధిదారులు పింఛన్ల కోసం సచివాలయాల వద్దకు బుధవారం కష్టపడి చేరుకున్నా లాభం లేకపోయింది. సాయంత్రం వరకు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసి పింఛను అందకపోవడంతో ఎంతో బాధతో వెనుదిరిగారు. తిరిగి మరుసటి రోజు అనారోగ్యంతో బాధపడుతున్నా పింఛన్ల కోసం ఆటోలలో ఇతర వ్యక్తుల సాయంతో సచివాలయాలకు చేరుకుని పింఛన్లు అందుకున్నారు. సచివాలయ సిబ్బంది ప్రవర్తనతో పింఛనుదార్లు అష్టకష్టాలు పడాల్సి వస్తుందని పలువురు విమర్శించారు.
వాలంటీర్ల దుష్ప్రచారం : అనకాపల్లిలో పింఛన్లు పంపిణీ వ్యవహారంపై వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పింఛన్ల పంపిణీపై దుష్ప్రచారం చేస్తున్నారు. పింఛన్ డబ్బులు రావంటూ, ఆలస్యం ఆవుతాయంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో అవ్వాతాతలు ఆందోళనకు గురవుతున్నారు.
సాయంత్రం వరకు ఉంటాం : సామాజిక పింఛన్ల డబ్బులు కోసం లబ్ధిదారులు గ్రామ సచివాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు. నాలుగో తారీఖు వచ్చిన డబ్బులు సక్రమంగా పంపిణీ చేయడం లేదని ఆవేదన చెందుతున్నారు. కోనసీమ జిల్లా ప్రాంతంలో పలు సచివాలయం వద్ద ఈరోజు ఈ పరిస్థితి నెలకొంది. ఉదయం ఎనిమిది గంటలకు తాము సచివాలయాల వద్దకు చేరుకున్నామని మధ్యాహ్నం ఒంటిగంట అయిన డబ్బులు ఇవ్వలేదని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. ప్రధానంగా బ్యాంకులలో డబ్బులు లేవని రేపు రమ్మని సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు తెలియజేస్తున్నారు. ఉదయం నుంచి ఇక్కడే ఉన్నామని సాయంత్రం వరకు ఉంటామని లబ్ధిదారులు అంటున్నారు.