PC Ghosh Commission on Kaleshwaram Inquiry : కాళేశ్వరం ఆనకట్టల అంశాలపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీఘోష్ కమిషన్, త్వరలోనే గత ప్రభుత్వ పెద్దలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రాణహిత - చేవెళ్లను కాదని కాళేశ్వరం ప్రాజెక్టు రీ-డిజైనింగ్, రీ-ఇంజినీరింగ్, నిర్మాణ స్థలం ఎంపిక, విధానపర నిర్ణయాలు, సంబంధిత అంశాలపై గత ప్రభుత్వ పెద్దలను కమిషన్ ప్రశ్నించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్న హైదరాబాద్ వచ్చిన జస్టిస్ పీసీఘోష్ ఇవాళ్టి నుంచి విచారణ తదుపరి ప్రక్రియను ప్రారంభించారు.
కాళేశ్వరం నిర్మాణంలో పనిచేసిన అధికారులు, ఇంజినీర్లు, విశ్రాంత అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి కమిషన్ ఇప్పటికే అఫిడవిట్లు తీసుకొంది. ఇప్పటి వరకు 50కి పైగా అఫిడవిట్లు కమిషన్‌కు అందాయి. గతంలో సీఎస్‌గా పనిచేసిన ఓ అధికారి నుంచి ఇంకా అఫిడవిట్ అందలేదని సమాచారం. ఇప్పటి వరకు వచ్చిన అఫిడవిట్లను విశ్లేషించిన కమిషన్ వాటి ఆధారంగా తదుపరి విచారణ కొనసాగించనుంది. అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది.
ఇందుకోసం వారికి మరోసారి సమన్లు జారీ చేయనున్నారు. క్రాస్ ఎగ్జామినేషన్, సాక్ష్యాల నమోదు ప్రక్రియను కొనసాగిస్తారు. సాంకేతిక అంశాలపై విచారణ దాదాపుగా ఓ కొలిక్కి వచ్చిందని, ఇక నుంచి ఆర్థిక అంశాలపై కమిషన్ దృష్టి సారించనున్నట్లు సమాచారం.
Kaleswaram Project Further investigation : ఈ దఫా మరికొందరు కూడా కమిషన్ ముందు హాజరుకానున్నారు. రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వి.ప్రకాశ్ కమిషన్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రాణహిత - చేవెళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుగా రీఇంజినీరింగ్ చేయడం, సంబంధిత అంశాలను ఆయన కమిషన్‌కు వివరించాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు జస్టిస్ పీసీ ఘోష్ పదవీకాలం ఈనెలాఖరుతో ముగియనుంది.
అయితే ఎంక్వైరీ నివేదికను అందించడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయి. తొలుత జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వంద రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కోరినా, కమిషన్ ఏర్పాటు చేసినట్లు ఆదేశాలు వచ్చి కార్యకలాపాలు ప్రారంభించడానికే నెల రోజుల సమయం పట్టింది. ఈ నేపథ్యంలో కమిషన్ గడువు జూన్ 30తో ముగియగా, రెండు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.