Paying Electricity Bills Through UPI: విద్యుత్ వినియోగదారులకు ఉపశమనం కలిగించే వార్త వచ్చింది. ఇకపై గతంలో మాదిరిగానే కరెంట్ బిల్లులను మొబైల్ యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేయొచ్చు. ఆర్బీఐ మార్గదర్శకాలతో ఇటీవల యూపీఐ యాప్‌లతో విద్యుత్ బిల్లులు చెల్లించే ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో మొబైల్ డిజిటల్ యాప్‌లతో ఎంతో సులభంగా కరెంట్ బిల్లులను చెల్లించే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
విద్యుత్తు బిల్లుల చెల్లింపులను ఈజీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీసీపీడీసీఎల్‌లు భారత్ బిల్ పేమెంట్ సిస్టం(బీబీపీఎస్)లో చేరాయి. డిస్కంలు బీబీపీఎస్‌లోకి రావడంతో ఇకపై బ్యాంకులు, ఫిన్‌టెక్ యాప్‌లు, వెబ్‌సైట్‌లతో పాటు బీబీపీఎస్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ల ద్వారానూ బిల్లులను సురక్షితంగా చెల్లించవచ్చని ఎన్‌పీసీఐకి చెందిన భారత్ బిల్ పే లిమిటెడ్ (బీబీఎల్) సీఈవో నూపూర్ చతుర్వేది శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో మళ్లీ గూగుల్ పే, ఫోన్‌పే వంటి యూపీఐ యాప్‌ల ద్వారా విద్యుత్ బిల్లులు కట్టే అవకాశం దొరికింది.
రిజర్వ్ బ్యాంక్ జులై 1 నుంచి యూపీఐ ద్వారా నేరుగా విద్యుత్తు బిల్లుల చెల్లింపులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. బీబీపీఎస్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ల ద్వారానే జరగాలని నిర్దేశించింది. ఈ క్రమంలో విద్యుత్ సంస్థలు బీబీపీఎస్‌లోకి చేరుతుండటంతో యూపీఐ చెల్లింపులకు మార్గం సుగమం అవుతోంది.