Dy CM Pawan Focus on Pending Cases in Several Departments: పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ శాఖల్లో విజిలెన్స్, ఏసీబీ, శాఖాపరమైన విచారణలు వేగవంతం చేయాలనీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఏళ్ల తరబడి కేసులు పెండింగ్లో ఉంచడం ఏమిటనీ డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి, వాటి వివరాలు ఏమిటో నివేదిక సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులకు పవన్ ఆదేశించారు.
ఉద్యోగుల పనితీరు మీద సున్నితమైన విజిలెన్స్ ఉండాలని సూచించారు. ఉద్యోగుల నిజాయతీ, పనితీరు, నిబద్ధతకు అది ఓ సూక్ష్మదర్శనిలా పని చేస్తుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఉద్యోగులపై నమోదు అవుతున్న విజిలెన్స్ కేసులు, శాఖాపరమైన విచారణలు, దర్యాప్తులు, చర్యలు ఏళ్ల పాటు పెండింగ్లో ఉండిపోవడం ఉద్యోగుల పని తీరుపై ప్రభావం చూపిస్తుందన్నారు.
క్రమశిక్షణ చర్యలు, శాఖాపరమైన విచారణలకు సంబంధించిన కేసులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న అంశంపై డిప్యూటీ సీఎం ఆరా తీశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృధ్ది, ఆర్డబ్ల్యూఎస్, అటవీ, పర్యావరణ శాఖల్లో ఉన్న విజిలెన్స్, ఏసీబీ, శాఖాపరమైన కేసుల వివరాలు, అవి ఎంత కాలంగా పెండింగ్లో ఉన్నాయి, దానికి కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కొన్ని కేసులు 20 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న విషయంపై పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
విజిలెన్స్ పెండింగ్ కేసులపై నివేదికను మూడు వారాల్లో ఇవ్వాలని తెలిపారు. అభియోగాలు వచ్చిన వారిపై విచారణలో తగిన పత్రాలు అందుబాటులో ఉండటం లేదనీ, ఇది విచారణ జాప్యానికి కారణం అవుతోందని అధికారులు వెల్లడించారు. తన శాఖల పరిధిలో అధికారులు, సిబ్బందిపై ఆరోపణలు వస్తే ప్రాథమిక విచారణ పకడ్భందీగా జరపాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు.
'సజ్జల ఎస్టేట్'కు పవన్ కల్యాణ్ - లెక్కలు తేల్చే పనిలో డిప్యూటీ సీఎం
తప్పు లేదంటే ఎలా? క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు: పవన్ కల్యాణ్