Pawan Kalyan and Prakash Raj Controversy : తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో తన కామెంట్‌ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తప్పుగా అర్థం చేసుకున్నారని ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. దీన్ని ఉద్దేశించి తాజాగా పవన్ కల్యాణ్ స్పందించారు. వ్యక్తిగతంగా ప్రకాశ్‌రాజ్ అంటే తనకు ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ప్రకాశ్‌రాజ్ తనకు మంచి మిత్రుడని, తమకు రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఒకరి పట్ల మరొకరికి ఎంతో గౌరవం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం తనకెంతో ఇష్టమని తెలిపారు. తిరుపతి లడ్డూ వివాదంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆ విషయంలో దోషులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో పోస్టు పెట్టానని వివరించారు. (దిల్లిలో మీ స్నేహితులంటూ) ఆయన ఆ విధంగా కామెంట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆయన పోస్ట్‌ను తాను తప్పుగా అర్థం చేసుకోలేదన్న పవన్, ప్రకాశ్‌రాజ్ ఉద్దేశం తనకు అర్థమైందన్నారు.
జస్ట్ ఆస్కింగ్ అంటూ వరుస ట్వీట్లు : తిరుమల లడ్డూ మహా ప్రసాదం కల్తీ ఘటనపై నటుడు ప్రకాశ్ రాజ్ మరో పోస్ట్ పెట్టారు. ‘మనకేం కావాలి? ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన, అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా? జస్ట్ ఆస్కింగ్’’ అని తాజాగా మరో పోస్ట్ పెట్టారు. ఆయన ఎవరిని ఉద్దేశించి పెట్టారు? ఎందుకు పెట్టారు? అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
తిరుమల శ్రీవారి కల్తీపై ఆరోపణలపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్న విషయం అందరికీ విధితమే. రాజకీయ నాయకులు, భక్తులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట నటుడు ప్రకాశ్‌రాజ్ పవన్‌కల్యాణ్‌ను కోట్ చేస్తూ ఓ పోస్ట్ చేశారు. "మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తతలు చాలు (కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు)’’ అని పేర్కొన్నారు.