Passengers Suffering Due to Lack of Buses in AP: ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన వారంతా ఓటేసేందుకు పెద్దఎత్తున పల్లెబాట పట్టారు. అతికష్టం మీద తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చారు. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. విజయవాడ నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరుకు బస్సుల కొరత ఏర్పడింది. ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు బస్సులు సరిపడా లేవు. రెగ్యులర్ సర్వీసులు ఏ మాత్రం సరిపోవడం లేదు. దీంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లలోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. బస్సుల సమాచారం అడిగినా ఆర్టీసీ యాజమాన్యం సరిగా స్పందించట్లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై ఈసీ చర్యలు - మరికొందరిపైనా కొరడా - CEO ACTION AGAINST NANDYALA SP
ఇప్పటికే సరిపడా బస్సుల్లేక ప్రయాణీకులు ఇబ్బందులు పడుతుంటే విజయవాడ నుంచి ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర సహా పలు ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది. సుమారు 48 సర్వీసులు రద్దు చేసినట్లు పీఎన్బీఎస్ లోని సమాచార కేంద్రం వద్ద నోటీసులు అంటించారు. రద్దుకు గల కారణాలను మాత్రం అధికారులు తెలపలేదు. అదనపు బస్సులు ఏర్పాటు చేయాల్సింది పోయి ఉన్నవాటిని రద్దు చేయడమేంటని ప్రయాణీకులు అధికారులను నిలదీశారు.
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఓటర్లతో గుంటూరు బస్టాండ్ కిక్కిరిసిపోయింది. గుంటూరు నుంచి పల్నాడు, బాపట్ల జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల కోసం మహిళలు, వృద్ధులు, పిల్లలు బస్టాండ్‌లో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. వందల మంది వచ్చి నానా అవస్థలు పడుతున్నప్పటికీ అనేక బస్సులను రెస్ట్ పాయింట్లో ఉంచడంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. పసిపిల్లలతో తాము అవస్థలు పడుతున్నా అధికారులు ఖాళీగా ఉన్న బస్సులను నడపకపోవడంపై ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సైతం ప్రయాణీకులతో కిక్కిరిసిపోయింది. ఒంగోలు నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు బస్సుల్లేక గంటల తరబడి పడిగాపులు కాశారు. బస్సులు ఎప్పుడు వస్తాయని అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఓటర్లతో అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌లో రద్దీ నెలకొంది. పల్లెవెలుగు బస్సులను అధికారులు పూర్తిగా రద్దు చేయడంతో ప్రయాణీకులు సొంతూళ్లకు వెళ్లేందుకు నానా అవస్థలు పడ్డారు. సత్యసాయి జిల్లా కదిరి బస్టాండ్ సైతం ప్రయాణీకులతో కిక్కిరిసిపోయింది. బస్సుల్లేక గంటల తరబడి బస్టాండ్లలోనే పడిగాపులు కాస్తూ నానా ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల సమయంలోనూ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయకపోవడంపై మండిపడుతున్నారు. వచ్చిన ఒకటీఅరా బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణీకులు ఎగబడ్డారు.