MMTS Trains Delay In Hyderabad : వాహనాల రద్దీని తప్పించుకొని సమయానికి రాకపోకలు సాగించాలన్న ఉద్యోగులకు ఎంఎంటీఎస్ సర్వీసులు చుక్కలు చూపిస్తున్నాయి. అరకొరగా సర్వీసులు, కార్యాలయాల సమయానికి పొంతన లేకుండా నడుపుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మేడ్చల్ నుంచి సికింద్రాబాద్, ఘట్‌కేసర్, మల్కాజిగిరి నుంచి ఐటీకారిడార్ వైపు నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుండగా నాలుగైదు సర్వీసులకు మించి నడపకపోవడం గమనార్హం.
అవసరం లేనిచోట అదనపు బోగీలతో, అవసరమైన చోట నడపకపోవడంపై ఎంఎంటీఎస్ ప్రయాణికుల అసోసియేషన్లు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఘట్‌కేసర్ నుంచి హైటెక్‌సిటీ, మల్కాజిగిరి నుంచి హైటెక్‌సిటీ మార్గంలో మూడే ఎంఎంటీఎస్‌లు నడుపుతున్నారని, వాటి సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
సమయాలివే :
- ఘట్‌కేసర్-లింగంపల్లి మార్గంలో ఉదయం 7.20 గంటలకు ఒక ఎంఎంటీఎస్ సర్వీసు, హైటెక్‌సిటీ నుంచి ఘట్‌కేసర్ సాయంత్రం 5.45కి ఒకటి నడుపుతున్నారు.
- మేడ్చల్ - లింగంపల్లి మార్గంలో సా.3.40గంటలకు, లింగంపల్లి - మేడ్చల్ మార్గంలో ఉ.10.20కి, సా.6.10 గంటలకు ఒక ఎంఎంటీఎస్ నడుస్తున్నాయి.
- మేడ్చల్ నుంచి నాంపల్లికి ఉదయం 11.50గంటలకు మాత్రమే రైలు సర్వీసు ఉంది. ఇక్కడి నుంచి మేడ్చల్‌కు మధ్యాహ్నం 1.40గంటలకు మరో ఎంఎంటీఎస్ రైలు ఉంది.
మరో నాలుగు సర్వీసులు పెంచాలి : ఘట్‌కేసర్ నుంచి హైటెక్‌సిటీ మార్గంలో 2వేల మంది ఐటీ ఉద్యోగులున్నప్పటికీ ఒకే రైలు నడుపుతున్నారు. ఈ ఎంఎంటీఎస్ చర్లపల్లి, నేరెడ్‌మెంట్, భూదేవీనగర్, సుచిత్ర, ఫెరోజ్‌గూడ, సనత్‌నగర్, భరత్‌నగర్, లింగంపల్లికి చేరుకుంటుంది. రూ.600కోట్లతో ఈ స్టేషన్ల అభివృద్ధి చేపట్టినప్పటికీ ఒకే రైలు నడపడంతో ఎక్కువ ప్రయోజనం లేదు.
ఉదయం 8గంటలకు ఘట్‌కేసర్ నుంచి వెళ్లే ఎంఎంటీఎస్ లింగంపల్లి చేరాక సికింద్రాబాద్, లింగంపల్లి మార్గాల్లో నడుపుతున్నారు. సాయంత్రం అదే రైలును లింగంపల్లి నుంచి ఘట్‌కేసర్‌కు నడుపుతుండటంతో ఉద్యోగులకు తిప్పలు తప్పడంలేదు. మరో నాలుగు సర్వీసులను పెంచాలని కోరుతున్నారు. కాగా చర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి వచ్చాకే కొత్తవి ప్రారంభించే అవకాశముందని రైల్వే అధికారులు చెబుతున్నారు. అప్పటివరకు స్వల్ప ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు కొత్త సర్వీసులు అందుబాటులోకి తెచ్చే అవకాశం లేదని కూడా తెలిపారు.
త్వరలోనే మౌలాలి నుంచి సనత్‌నగర్ వరకు ఎంఎంటీఎస్ సర్వీస్ : అరుణ్ కుమార్