YSRCP Candidate Election Campaign Materials Seized: బాపట్ల జిల్లా పర్చూరు వైసీపీ అభ్యర్థి యడం బాలాజీకి చెందిన ప్రచార సామగ్రిని బాపట్ల - గుంటూరు సరిహద్దులో ఉన్న పిట్టలవానిపాలెం చెక్పోస్ట్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సామగ్రికి సంబంధించి సరైన అధారాలు, బిల్లులు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి పర్చూరు వైసీపీ అభ్యర్థి యడం బాలాజీ బొమ్మలతో ఉన్న 1500 టీషర్టులతో పాటు 500 ఫ్యాన్ గుర్తుల బెలూన్లను పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి చీరాల వెళుతున్న ట్రావెల్ బస్సులో వీటిని గుర్తించారు.
అయితే నిబంధనలకు విరుద్ధంగా సామాగ్రి, నగదు, తాయిలాలకు సంబంధించిన వస్తువులు తరలిస్తే సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు నిత్యం హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బాపట్ల - గుంటూరు సరిహద్దులో ఉన్న పిట్టలవానిపాలెం చెక్పోస్ట్ వద్ద తనిఖీల్లో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న యడం బాలాజీకి చెందిన ప్రచార సామగ్రికి సంబంధించి ఎటువంటి కేసు నమోదు చేయలేదు.
వీటికి సంబంధించి రిసీవింగ్ రసీదు యడం బాలాజీ పేరు మీద ఉన్నట్లు సమాచారం. వీటిని చందోల్ పోలీస్ స్టేషన్కు తరలించగా జీఎస్టీ అధికారులు వచ్చి వాటి విలువను లెక్క కట్టారు. అయితే సంబంధిత ఆర్వో అనుమతి తీసుకుని పది వేలకు మించి సామగ్రి కొనుగోలు చేయాలి. లేదంటే కేసు నమోదు చేయాలని నిబంధనలు ఉన్నాయి. పోలీసులు పట్టుకున్న సామగ్రి విలువ దాదాపు లక్ష రూపాయలని తెలుస్తుంది. పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.