Paddy Crop Damage in Warangal : ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానపడింది. వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో భారీ వర్షానికి పలుచోట్ల చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరాకి అంతరాయం ఏర్పడింది. అకాల వర్షం కారణంగా కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం, మొక్కజొన్న తడిసి ముద్దయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో తడిసిపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు.
వరంగల్ జిల్లాలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం పడటంతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం కష్టించిన రైతన్నకు రబి సాగుకు నీరందక దిగుబడులు తగ్గాయి. వచ్చిన కొద్దిపాటి దిగుబడిని అమ్ముకొని సొమ్ము చేసుకుందామని కోనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చారు. కానీ నిన్న కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పగలు భగభగలు సాయంత్రం పిడుగులు - రాష్ట్రంలో గాలివాన బీభత్సం - UNTIMELY RAINS IN TELANGANA 2024
Heavy Rains in Warangal : వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపురం, దుగ్గొండి మండలాలలో గత రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసి ముద్దయింది. అనుకోకుండా ఒక్కసారిగా గాలి దుమారంతో పాటు వర్షం పడడంతో ధాన్యపు రాశులపై కప్పిన టార్పాలిన్ కవర్లు కొట్టుకుపోవడంతో వడ్లు తడిసాయి. దీంతో చేతికందిన పంట నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండ తీవ్రతలకు చివరి అయకట్టు రైతులకు నీరందకపోవడంతో సగం పంటలు ఎండిపోయాయని తెలిపారు.
"కొనుగోలు మార్కెట్కు తెచ్చి వారం రోజులైనా తేమ పేరుతో వడ్లు కొనలేదు. అకాల వర్షాల వల్ల ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. వరుస సెలవు దినాలు రావడంతో ధాన్యం కొనట్లేదు. మళ్లీ గాలి వాన వస్తే మా పరిస్థితి అద్వానంగా తయారవుతుంది. తడిసిన ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేసి మమ్మల్ని ఆదుకోవాలి. -రైతులు
మిగిలిన పొలాలకు మోటార్ల ద్వారా నీరు పారించుకొని వచ్చిన దిగుబడిని అమ్ముకొని సొమ్ము చేసుకుందామని కొనుగోలు సెంటర్కు తీసుకువస్తే తేమ పేరుతో నాలుగు రోజులైనా కొనుగోలు చేయట్లేదని వాపోయారు. దీంతో రాత్రి కురిసిన అకాల వర్షానికి ధాన్యపురాసుల కింది నుంచి నీళ్లు వెళ్లి తడిసి ముద్దయిందని తెలిపారు. మళ్లీ ఈరోజు నుంచి మార్కెట్కు వరుస సెలవు దినాలు రావడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసి తమని ఆదుకోవాలని వరంగల్ రైతన్నలు ప్రభుత్వాన్ని కోరారు. ఇవే కాకుండా మామిడి పండ్లు కూడా ఈదురు గాలులకు నేల రాలాయి. ఎలాగైనా ప్రభుత్వం తమని ఆదుకోవాలని మామిడి రైతులను వేడుకుంటున్నారు.
నడివేసవిలో వర్షబీభత్సం - నేలరాలిన పంటలు - కొట్టుకుపోయిన ధాన్యరాశులు - SUDDEN RAINS IN TELANGANA