ONGC Gives Compensation to Fishermen In Yanam : కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో మత్స్యకారులు చేపట్టిన నిరసన దీక్షలు ఎట్టకేలకు ఫలించాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఓఎన్‌జీసీ (ONGC) సంస్థ మత్స్యకారులకు చెల్లించాల్సిన పరిహారాన్ని విడుదల చేయాడానికి అంగీకరించింది. మెుత్తం 5,299 మంది మత్స్యకారులకు మెుదటి విడతలో రూ. 90 కోట్ల 50 లక్షలు ఇవ్వడానికి ముందుకువచ్చారు.
పరిహారం వెంటనే చెల్లించాలి - ఓఎన్‌జీసీ కార్యాలయం వద్ద మత్స్యకారుల ఆందోళన
యానాంకు సమీపంలోని సముద్ర జలాలలో ప్రభుత్వరంగ చమురు సంస్థ ఓఎన్‌జీసీ జరుపుతున్న కార్యకలాపాల కారణంగా మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేటనే ప్రధాన వృత్తిగా జీవించే వేలాది మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. సంస్థ కార్యకలాపాల వల్ల అనేక జాతుల మత్స సంపద అంతరించిపోయే ప్రమాదం ఉంది. అంతేగాక చమురు అన్వేషణ జరిగే రిగ్గుల సమీపంలో ఒక కిలోమీటర్ పరిధిలోకి మత్స్యకారులకు సంబంధించిన మెకనైజర్ బోట్లు, ఇంజిన్ నావలను సంస్థ అనుమతించేది కాదు. దీంతో మత్స్యకారులకు రోజంతా వేటాడినా ఫలితం లేకుండా పోతుంది. ఈ కారణంగా మత్స్యకార కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి.
ONGC has Paid Compensation to the Fishermen : దీంతో చమురు సంస్థ కార్యకలాపాలు నిర్వహించే కాలానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మత్స్యకార కుటుంబాలు, స్థానిక నాయకుడు మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో 103 రోజులపాటు నిరసన దీక్షలు చేపట్టారు. చివరికి పుదుచ్చేరి ప్రభుత్వం, ఓఎన్‌జీసీ సంస్థ యాజమాన్యం మధ్య ఒప్పందం కుదిరి పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. అయినా పరిహారం విడుదల చేయడంలో తీవ్ర ఆలస్యం చేస్తుండడంతో గత నెల రెండో తేదీన ఓఎన్‌జీసీ కార్యాలయం వద్ద వేలాదిమంది నిరసన దీక్ష చేపట్టారు. చివరకు ఈ నెలాఖరులోగా డబ్బులు చెల్లించకపోతే మళ్లీ నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించడంతో చమురు సంస్థ ఉన్నతాధికారులు పరిహరం చెల్లించేందుకు ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు.
ఓఎన్‌జీసీ చమురు క్షేత్రాల్లో వాటా ప్రైవేటుకు!
మొత్తం 5472 మంది మత్స్యకారులకు 24 నెలలుగాను రూ. 158 కోట్లు పరిహారం చెల్లించాల్సి ఉంది. అయితే 173 మంది మత్స్యకారులు వేటను మానేసి ఇతర వృత్తిని చేస్తున్నారని వారిని తొలగించారు. చివరకు 5299 మందికి చెల్లించడానికి ఓఎన్‌జీసీ సంస్థ అంగీకరించింది. ఒకేసారి అంత మొత్తం చెల్లించడం కుదరకపోవడంతో మెుదట 15 నెలలకు గాను 90 కోట్ల 54 లక్షల 16 వేల రూపాయలు చెల్లించేందుకు సిద్ధమైంది. ఈ చెక్కును ఓఎన్‌జీసీ అధికారులు పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి, మత్స్యశాఖ మంత్రి లక్ష్మీనారాయణ, పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి, మల్లాడి కృష్ణారావు సమక్షంలో అందజేశారు.
దీంతో ఎన్నోరోజుల నుంచి చేస్తున్న పోరాటం చివరికి ఫలించి పరిహారం అందుతుందని మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సహకరించిన గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్కు, ముఖ్యమంత్రి రంగస్వామికి, మత్స్య శాఖ మంత్రి లక్ష్మీనారాయణకు, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకు మత్స్యకారులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మిగిలిన 173 మంది మత్స్యకారులకు పరిహారం చెల్లించాలని మల్లాడి కృష్ణారావు డిమాండ్ చేశారు. అవసరమైతే న్యాయ పోరాటమైనా చేద్దామని మత్స్యకారులకు భరోసా ఇచ్చారు.