Nagarjuna Sagar Project : నాగార్జున సాగర్ జలాశయానికి మరోసారి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు నాలుగు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 4 గేట్లు ఐదు అడుగుల మేర పైకి ఎత్తి స్పిల్‌వే ద్వారా 32 వేల 4 వందల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ జలాశయానికి ఇన్‌ఫ్లో 76 వేల 5వందల క్యూసెక్కులు వస్తుండడంతో, అంతే మొత్తంలో ఔట్‌ఫ్లో 76 వేల 5 వందల క్యూసెక్కులు నీరు దిగువకు వెళుతోంది. నాగార్జున సాగర్ జలాశయం ప్రస్తుత నీటి మట్టం 590.00 అడుగుల కాగా, పూర్తి స్థాయి నీటి మట్టం కూడా 590.00 అడుగులుగా ఉంది.
ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 312.0450 టీఎంసీలు మొత్తం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం కూడా 312.0450 గా ఉంది. ఈ ఏడాది కర్ణాటకలో కురిసిన భారీవర్షాలకు కృష్ణమ్మ పోటెత్తింది. ఆగస్ట్ నుంచి ఇప్పటికే పలుమార్లు పూర్తి గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ నెలలో సాగర్ గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి. కొద్దిరోజులుగా వర్షం కురుస్తున్న భారీగా వరద రాకపోవడంతో గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి రాలేదు. జల విద్యుత్ కేంద్రాల ద్వారా అదనపు ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు దిగువకు కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వాయుగుండం ప్రభావం వల్ల వర్షాలు పడటంతో రిజర్వాయర్‌లోకి ప్రవాహ తీవ్రత పెరిగింది. ఎగువ నుంచి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని 4 క్రస్ట్ గేట్లు ఎత్తినట్లు నాగార్జున సాగర్ డ్యామ్ అధికారులు తెలిపారు.
మరోవైపు జలకళను సంతరించుకొని దిగువకు దిగుతున్న కృష్ణమ్మను చూసేందుకు పలు టూరిజం ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ టూరిజం నాగార్జున సాగర్ కోసమే ప్రత్యేకంగా ప్యాకేజీని ప్రకటించింది.
టూర్ ప్యాకేజీ ఇదే: హైదరాబాద్ - నాగార్జునసాగర్ - హైదరాబాద్ పేరుతో తెలంగాణ టూరిజం ప్యాకేజీ ప్రకటించింది. కేవలం ఒక్క రోజులోనే టూర్ ముగిసేలా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఉదయం వెళ్లి మళ్లీ రాత్రి వరకు ఇంటికి చేరుకోవచ్చు. ప్రతీ శని, ఆదివారం రోజుల్లో ఈ టూర్ ఉంటుంది. హైదరాబాద్ నుంచి బస్సు జర్నీ ద్వారా దీనిని నిర్వహిస్తున్నారు.
"నాగార్జున సాగర్" టూర్ - కేవలం రూ.800లకే తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ! - Nagarjuna Sagar Tour